‘ఓటు హక్కుకు అర్హత కలిగిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి...అర్హత ఉంటే క్షణాల్లో ఓటు హక్కు కల్పిస్తాం..., ఇందుకు ఆన్‌లైన్‌లో, బూత్ స్థాయిలో కూడా నమోదుకు అధికారులు ఉంటారు...’ ఇవన్నీ ఎన్నికల అధికారులు కొద్ది నెలలుగా చెబుతున్న మాటలు. వారి మాటలు నమ్మి అర్హత కలిగిన వారంతా ముందుకొచ్చారు. ఓటరు నమోదుకు దరఖాస్తులు ఇచ్చారు. కాని ఆ దరఖాస్తులన్నీ ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయంలోనే మగ్గిపోతున్నాయి. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి.
చీపురుపల్లి: ఓటరు నమోదుకు అవసరమైన ఈఆర్‌ఎమ్‌ఎస్ అనే వెబ్‌సైట్ తెరుచుకోవడం లేదు. నిన్న కాదు మొన్న కాదు గత ఏడాది డిసెంబరు 1 నుంచి ఈ వెబ్‌సైట్ తెరుచుకోలేదు. దీంతో ఓటరు నమోదు లేదు, నమోదైన వారికి గుర్తింపు కార్డులు రావడం లేదు. మరో 24 గంటల్లో జాతీయ ఓటర్లు దినోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు సిద్ధమవుతుంటే అదే సమయంలో ఓటరు నమోదుకు అవసరమైన వెబ్‌సైట్ తెరుచుకోకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ తెరుచుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. ఓటరు నమోదుపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించిన తరువాత ఇలా వెబ్‌సైట్‌లు పని చేయకుండా చేస్తుండడంతో క్షేత్ర స్థాయిలో ఉన్న అధికారులు సైతం అవస్థలు పడాల్సి వస్తోంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేల ఓటరు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులు ఆన్‌లైన్ కాకపోతే వారంతా తమను నిలదీస్తారనే ఆందోళనలో అధికారులు ఉన్నారు. అంతేకాకుండా 2017 జూన్ నెల తరువాత కొన్ని ఓటరు నమోదు దరఖాస్తులు ఆన్‌లైన్ చేశారు. అయితే జాబితాల్లోకి వారి ఓటు హక్కు వచ్చినప్పటికీ గుర్తింపు కార్డులు తీసుకోవాలన్నా వెబ్‌సైట్ పని చేయకపోవడంతో వారంతా గుర్తింపు కార్డులకు దూరమవుతున్నారు. డిసెంబరు 1 నుంచి వెబ్‌సైట్ తెరుచుకోకపోవడంతో ఒక్క చీపురుపల్లి మండలంలోనే 700 దరఖాస్తులు ఆన్‌లైన్ చేయకుండా ఉండిపోవాల్సి వచ్చింది. ఒక్క మండలంలోనే వందల సంఖ్యలో దరఖాస్తులు ఇలా ఉంటే జిల్లాలో ఇంకెన్ని దరఖాస్తులు ఉండిపోయి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
వెబ్‌సైట్ తెరుచుకోవడం లేదు...
ఓటరు నమోదుకు సంబంధించిన ఈఆర్‌ఎమ్‌ఎస్ వెబ్‌సైట్ తెరుచుకోవడం లేదు. గత ఏడాది డిసెంబరు 1 నుంచి అదే పరిస్థితి నెలకొంది. చీపురుపల్లి మండలంలోనే 700 దరఖాస్తులు వరకు నమోదుకు సిద్ధంగా ఉన్నాయి. వెబ్‌సైట్ తెరుచుకుంటే తక్షణమే ఆన్‌లైన్ చేస్తాం. –రమణమ్మ, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్, చీపురుపల్లి
Comments
Please login to add a commentAdd a comment