కరాచీ : చేసేది కూలి పని అయినా కష్టపడిన సొమ్మే తనదని భావించే గొప్ప వ్యక్తిత్వం అతనిది. తనది కాని దాన్ని ఇచ్చినా తీసుకోకుండా, పరుల సొమ్ము పాపంగా భావిస్తే.. ఎంతటి కీర్తి వస్తుందో చెప్పడానికి తానే
ఉదాహరణగా మిగిలాడు పాకిస్తాన్‌కు చెందిన ఓ కూలీ.
పాకిస్తాన్‌కు చెందిన ఖటాక్ అనే ఓ నెటిజన్ చేసిన ట్విట్‌తో ఓ కూలీ నిజాయితీ ప్రపంచానికి తెలిసింది. 'ఓ వ్యక్తి మా ఇంటి సమీపంలోని ఓ ఇంటి నిర్మాణ పనుల్లో కూలీగా పని చేసేవాడు. అయితే ఓ రోజు మా ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. మా సోదరుడు వెళ్లి చూడగా గతంలో మీరేమైనా బంగారం పోగొట్టుకున్నారా అని అ వ్యక్తి అడిగాడు. మా సోదరుడు కొద్దిసేపు ఆలోచించి అవునవును మూడేళ్ల కిందట చెవిదుద్దులు పొగొట్టుకున్నామన్నాడు. అయితే సరైన ఇంటికే వచ్చానని భావించిన ఆ వ్యక్తి వెంటనే తన జేబులోంచి బంగారు చెవిదుద్దులు తీసి మా సోదరుడికిచ్చాడు. 2015లో పోగొట్టుకున్న చెవిదుద్దులు దొరకడంతో కొద్ది సేపు నమ్మలేకపోయాము. మా కుటుంబం వెంటనే తేరుకొని అతని నిజాయితీకి మెచ్చి కొంత డబ్బు ఇవ్వాలనుకున్నాము. కానీ, దానికి సదరు వ్యక్తి నవ్వుతూ తిరస్కరించాడు' అంటూ ఖాటాక్ పేర్కొన్నారు.
మీరు చేసిన పనికి ప్రతిఫలంగా ఎంతో కొంత తీసుకోవాల్సిందేనంటూ పట్టుబట్టి మరీ అతడి జేబులో కొంత డబ్బును ఖటాక్ పెట్టితే.. అంతే స్పీడుగా నేను భగవంతుడిచ్చే ప్రతిఫలం కోసం ఎదురు చూస్తానంటూ తిరిగి ఆ డబ్బును ఖటాక్‌కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించి ఖటాక్ తన ట్విట్టర్‌లో పోస్ట పెట్టడంతో వైరల్ అయింది. నిజాయితీకి ఆ వ్యక్తి నిలువెత్తు నిదర్శనం అంటూ సదరు వ్యక్తిని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు. అతడి ఇంటి అడ్రస్ ఇవ్వండి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేద్దామని నెటిజన్లు ఖటాక్‌ను అడిగితే .. డబ్బు తీసుకోవాల్సిందిగా ఆ వ్యక్తిని ఎంతగానో ప్రాదేయపడ్డానని ఖటాక్ తెలిపారు. కష్టపడి సంపాదిస్తా కానీ, ఇంకొకరి డబ్బును ఉచితంగా తీసుకోనని ఆ వ్యక్తి చెప్పినట్టు ఖటాక్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ కూలీకి సంబంధించిన పూర్తివివరాలు తెలియకపోయినా, చెవిదుద్దులతోపాటూ అతడిని తీసిన ఓ ఫోటోను ఖటాక్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment