ప్ర‘యోగం’ లేదు | govt colleges neglecting intermediate practicals | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 14 2018 11:56 AM | Last Updated on Sun, Jan 14 2018 11:56 AM

govt colleges neglecting intermediate practicals - Sakshi

జిల్లావ్యాప్తంగా పలు ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని ఇంటర్‌ విద్యార్థులు అసౌకర్యాల నడుమ ప్రాక్టికల్స్‌ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రాక్టికల్స్‌ పరీక్షలు జరగనున్నాయి. కొన్ని కళాశాలల్లో  అవసరమైన సామగ్రి లేకపోవడం, మరి కొన్నింటిలో నేర్పించే సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు.  

రాయచోటి రూరల్‌/కడప ఎడ్యుకేషన్‌: కొత్త ఆవిష్కరణలకు విద్యార్థి దశలోనే పునాది పడాల్సి ఉంటుంది. అందుకోసం ఇంటర్‌లో ప్రయోగాత్మక విద్యను బోధించడం జరుగుతోంది. అధ్యాపకులు, ప్రయోగశాలలు లేకపోవడం, పరికరాలు, రసాయనాలు కొనుగోలుకు నిధులు మంజూరు కాకపోవడం విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. దీంతో వీరికి ప్రయోగాత్మక విద్య దూరమవుతోంది. ప్రభుత్వ కళాశాలల్లో సిబ్బంది కొరత కారణంగా ప్రయోగాలు అంతంత మాత్రంగానే సాగాయి. ప్రైవేటు కళాశాలల్లో కొంత వరకు ల్యాబ్‌లు, పరికరాలు ఉన్నా యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల చెంతకు ప్రయోగాలు చేరడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరి కొన్నింటిలో ప్రయోగశాలలు అలంకారప్రాయంగానే ఉండటం గమనార్హం.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 21 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు జరగనున్నాయి. సుమారు 18356 మంది హాజరుకానున్నారు. వారి కోసం 61 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసినట్లు ప్రాంతీయ ఇంటర్‌ విద్యాపర్యవేక్షణాధికారి ఎస్‌. రవి చెప్పారు. విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ పరీక్షలు జంబ్లింగ్‌ పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రాక్టికల్స్‌లోనూ, పరీక్షల్లోనూ మంచి మార్కులు సాధిస్తే తప్ప తదుపరి కోర్సుల్లో సీట్లు సాధించలేమన్న ఆలోచనల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. రాయచోటి విషయానికి వస్తే సుమారు 3600  మంది వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షకు  సిద్ధంగా ఉన్నారు. అందులో అధిక శాతం జిల్లా వ్యాప్తంగా ఎన్నో సంఘటనలు మంది ప్రవేటు కళాశాలల్లో చదువుకుంటున్నారు.

రాయచోటిలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ,  బాలికల జూనియర్‌ కాలేజీ, ఏఎన్‌ఎం అండ్‌ బీఆర్‌(ప్రతిభా) కళాశాల, పద్మావతి జూనియర్‌ కళాశాల , సీఎన్‌ రాజు, కాకతీయ, అర్చన, ఎస్‌బీటీ, వీరభద్ర కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు  అధికారులు చెబుతున్నారు.  కొన్ని కళాశాలల్లో పరికరాలు సరిగా లేకపోవడం, మరి కొన్నింటిలో ప్రయోగశాలలు అలంకారప్రాయంగా ఉండటం కనిపిస్తున్నాయి. గత ఏడాది తరహాలోనే ఈ సారి కూడా ఇంటర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ జంబ్లింగ్‌ పద్ధతిలో నిర్వహిస్తారు దీంతో పరీక్షలు ఎలా రాయాలోనని విద్యార్థులు, ఇతర కళాశాలలల్లో వీరు ప్రాక్టికల్స్‌ ఎలా చేస్తారోనన్న భయం యాజమాన్యంలో నెలకొంది.జంబ్లింగ్‌ పద్ధతిని రద్దు చేయాలని గతంలో పలువురు  డిమాండ్‌ చేయడం తెలిసిందే.


ప్రాక్టికల్స్‌కు సిద్ధంగా ఉన్నాం
అధ్యాపకులు గత కొంత కా లంగా కళాశాలలో ఉన్న ప్రయోగశాలలో మాకు ప్రాక్టికల్స్‌ నేర్పించారు. ప్రస్తుతం  అన్ని ర కాల పరికరాలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో ప్రారం భం కానున్న ప్రాక్టికల్స్‌కు సిద్ధంగా ఉన్నాం.  -వీరాంజనేయులు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థి, రాయచోటి

సౌకర్యాలు ఉన్నాయి
మాది పాత ప్రభుత్వ జూని యర్‌ కళాశాల. ఇక్కడ అన్ని రకాల ప్రయోగశాలలు ఉన్నాయి. ఇప్పటికే విద్యార్థులకు అన్ని రకాల ప్రయోగాలను చెప్పడం జరిగింది. సిలబస్‌ పూర్తి చేసి, ప్రాక్టికల్స్‌కు పిల్లలను సిద్ధం చేశాం. –కె.కె. రావు, జువాలజీ అధ్యాపకులు , ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, రాయచోటి
 
ప్రాక్టికల్స్‌ పకడ్బందీగా నిర్వహిస్తాం

ఫిబ్బవరి 1వ తేదీ నుంచి ఇంటర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ను   నిర్వహిస్తాం. అన్ని సెంటర్లలో ప్రయోగశాలలు ఉన్నాయి.  ఎటువంటి అవకతవకలు జరగకుండా చూసేందుకు ప్రణాళికలు రూపొందించాం. ప్రయోగశాలలు సరిగా లేని కళాశాలల విషయం  మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – ఎస్‌. రవి, ప్రాంతీయ ఇంటర్‌విద్యా పర్యవేక్షణాధికారి, వైఎస్సార్‌ జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement