చేసిందొకరు..చెప్పుకొనేదొకరు | paidipalem reservoir 95 percent completed in ysr govt | Sakshi
Sakshi News home page

చేసిందొకరు..చెప్పుకొనేదొకరు

Published Sat, Dec 30 2017 5:48 PM | Last Updated on Fri, Aug 10 2018 9:50 PM

పులివెందుల ప్రాంత రైతులను కరువు బారి నుంచి తప్పించడానికి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన పైడిపాలెం ప్రాజెక్టు పనులు 95శాతం అప్పట్లోనే పూర్తయ్యాయి. కేవలం 5శాతం పనులు చేపట్టి, రూ.23కోట్లు మాత్రమే ఖర్చుచేసి టీడీపీ నాయకులు అంతా తామే చేశామని ఆర్భాటం చేస్తుండటం చూసి రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు. గండికోట ఎత్తిపోతల పథకం నుంచి 10కి.మీ పైపులైన్‌ ద్వారా పైడిపాలెం ప్రాజెక్టులోకి నీరు చేరనుంది. ఈ పైపులైన్‌ పనులు కూడా వైఎస్సార్‌ హయాంలోనే పూర్తయ్యాయి. అలాగే రిజర్వాయర్‌ నుంచి అంతే నీటితో సూక్ష్మనీటి సేద్యం ద్వారా సింహాద్రిపురం మండలంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందనుంది. వైఎస్సార్‌ ఉంటే కృష్ణాజలాలు ఎప్పుడో పరుగులు తీసి ఉండేవని ప్రతిఒక్కరి మాట.

పులివెందుల/సింహాద్రిపురం : ప్రాజెక్టుకు నిధులు విడుదల చేసి పనులను ప్రారంభించి దాదాపు పూర్తిచేసిందొకరు..చివర్లో కొద్దిపాటి పనులు చేసి అంతా తామే నిర్మించామని ఆర్భాటం చేసేదొకరు. వాస్తవ విరుద్ధంగా, ఆర్భాటామే లక్ష్యంగా ఉన్న ఈ వ్యవహారం పైడిపాలెం ప్రాజెక్టు విషయంలో నడుస్తోంది. ప్రాజెక్టు ప్రారంభ సమయంలో సాధ్యంకాదంటూ ఎత్తిపొడుపు మాటలు మాట్లాడిన వారే ఇప్పుడు అంతా తామే చేశాం, నీరిచ్చామంటూ చెప్పుకోవడం విడ్డూరమని రైతులు చెబుతున్నారు.  ఈ ఏడాది జనవరి 11న ఎట్టకేలకు కృష్ణాజలాలు గండికోట ఎత్తిపోతల పథకం ద్వారా పైడిపాలెంకు చేరాయి. పైడిపాలెం వద్ద 6 టీఎంసీలు నిల్వ ఉండేలా 2005 మే 23న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. రెండు కొండల మధ్య అనుసంధానంగా 42.5 మీటర్ల ఎత్తు, 43.68కి.మీ పొడవుతో రాతికట్ట నిర్మాణం చేపట్టారు. రూ.712 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. కొండాపురం, గడ్డంవారిపల్లె, చెర్లోపల్లె గ్రామాల మధ్య పంప్‌ హౌస్‌లు నిర్మించారు. వైఎస్సార్‌ హయాంలో రూ.690కోట్ల వ్యయంతో పైడిపాలెం ప్రాజెక్టు పనులు అప్పట్లోనే పూర్తయ్యాయి. ఆయన మరణం తర్వాత నత్తనడకన సాగాయి. రోశయ్య హయాంలో ప్రాజెక్టు పనులు కొంచెం కూడా ముందుకు సాగలేదు. మిగిలిన 5 శాతం మాత్రమే కిరణ్, టీడీపీ ప్రభుత్వాలు చేపట్టాయి.

పైడిపాలెం ప్రాజెక్టుకు నీరు ఇలా.. :  పీబీసీకి నీరందించడమే లక్ష్యం. ప్రాజెక్టు కింద 47,500ఎకరాల ఆయకట్టుగా స్థిరీకరించారు. పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం, లింగాల, తొండూరు, వేముల, వేంపల్లె, పులివెందుల మండలాల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వైఎస్‌ మరణానంతరం పనులు పూర్తి కావడానికి తొమ్మిదేళ్లు గడిచాయి. వరద నీటితోపాటు శ్రీశైలం మిగులు జలాల ఆధారంగా గండికోట రిజర్వాయర్‌ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా పైడిపాలెం రిజర్వాయర్‌కు నీటిని పంపింగ్‌ చేసి అటు నుంచి ప్రత్యేక కాలువల ద్వారా పీబీసీకి విడుదల చేయాల్సి ఉంది. శ్రీశైలం మిగులు జలాలను కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడుకు, అటు నుంచి ఓర్వకల్లు ఆ తర్వాత అవుకు తదనంతరం జిల్లాలోని గండికోటకు, అక్కడనుంచి ఎత్తిపోతల పథకాల ద్వారా పైడిపాలెం ప్రాజెక్టుకు అందించేలా ప్రణాళిక రూపకల్పన చేశారు. మండలంలోని హిమకుంట్ల చెరువు నుంచి 3 టీఎంసీల నీటిని పీబీసీకి తరలించడం పైడిపాలెం ప్రాజెక్టు లక్ష్యం. ప్రసుతం గం డికోట ఎత్తిపోతల పథకాల నుంచి ఆయకట్టుకు సాగునీరు అందించడంతోపాటు కొన్ని  గ్రామాలకు తాగునీటిని కూడా అందిస్తున్నారు.  

వైఎస్సార్‌ చలువతోనే కృష్ణాజలాలు : పైడిపాలెం ప్రాజెక్టుకు కృష్ణాజలాలు రావడం వెనుక వైఎస్సార్‌ కృషి ఎంతో ఉందని ఈ ప్రాంత ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌ ముందుచూపుతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకపోతే ప్రస్తుతం కృష్ణాజలాలు ఈ ప్రాంతానికి చేరి ఉండేవి కావనేది జగమెరగని సత్యం. ప్రస్తుతం ప్రాజెక్టులో 3.53 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 6టీఎంసీలు కాగా.. లీకేజీ కారణంగా నిపుణుల ఆదేశాల మేరకు ప్రస్తుతం ప్రాజెక్టుకు నీరు నిలుపుదల చేశారు.

టీడీపీ ఆర్భాట ప్రచారం: దివంగత వైఎస్సార్‌ హయాంలో 95శాతం పనులు పూర్తి చేసుకున్న ప్రాజెక్టుకు టీడీపీ ప్రభుత్వం ఈ మూడేళ్ల కాలంలో కేవలం రూ.23కోట్లు మాత్రమే ఖర్చుచేసి ప్రాజెక్టుకు తామే నీరు తీసుకొస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. వైఎస్సార్‌ చేపట్టిన ప్రాజెక్టుకు తెలుగుదేశం నాయకులు నీటిని విడుదల చేసి కేవలం లష్కర్ల పాత్రను పోషిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు.

వైఎస్సార్‌ పుణ్యమే..
శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి కృష్ణాజలాలు పైడిపాలెంకు చేరుకుని ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందుతోందంటే అది వైఎస్సార్‌ పుణ్యమే. కరువుతో అల్లాడుతున్న ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి రైతు బాంధవుడు ముందుచూపుతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు.
– ఎన్‌.రాజేశ్వరరెడ్డి(రైతు), సింహాద్రిపురం

జీవితాంతం రుణపడి ఉంటాం
పైడిపాలెం ప్రాజెక్టును ఈ ప్రాంతంలో నిర్మించిన వైఎస్సార్‌కు ఈ ప్రాంత రైతులు జీవితాంతం రుణపడి ఉంటాం. కృష్ణాజలాలు తీసుకరావడమంటే మాటల్లో సాధ్యం కాదని, టీడీపీ నాయకులు అప్పట్లో ఎత్తిపొడిచారు. కానీ చివరకు వైఎస్సార్‌ కృషితో ఈ ప్రాంతానికి కృష్ణాజలాలు వచ్చి చేరాయి.
– ఎం.రమాదేవి, మహిళా రైతు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement