జాబ్ మేళా పేరుతో మోసం..ఇద్దరి అరెస్టు
హైదరాబాద్: జాబ్‌మేళాలో పాల్గొని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు పొందవచ్చనే ఆకర్షణీయ ప్రకటనతో జనాన్ని మోసం చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నాచారంనకు చెందిన మునిగేటి నెమిలి కుమార్, మౌలాలిలోని జవహర్‌నగర్‌కు చెందిన లింగాల సుమిత్ అనే వారు నిరుద్యోగులు. సులువుగా డబ్బు సంపాదించటానికి వారిద్దరూ కలిసి ఒక ప్లాన్ వేశారు. దీని ప్రకారం.. తాము నిర్వహించే జాబ్‌మేళా ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయని, దీనికి హాజరై ఉద్యోగాలు పొందాలని ఇటీవల వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు.
ఈ ప్రకటనతో ఆశపడిన వందలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు ఈ నెల 26వ తేదీన ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూలులో నిర్వహించిన మేళాకు హాజరయ్యారు. రిజిస్ట్రేషన్ కోసం అంటూ ఒక్కొక్కరి నుంచి రూ. 200 చొప్పున మొత్తం రూ.1,11,600 వసూలు చేశారు. అంతేకాకుండా అధికారుల అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఈ మేళాకు ప్రకటనలో పేర్కొన్న విధంగా ప్రముఖ కంపెనీలేవీ కూడా రాలేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన అభ్యర్థులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఏఎస్ఎఫ్(అద్వైత సేవా ఫౌండేషన్)పేరుతో వీరు స్వచ్ఛంద సేవా సంస్థను కూడా నడుపుతున్నట్లు విచారణలో తేలింది.