స్త్రీలపై లైంగికదాడులు అరికట్టాలి
ఐద్వా జాతీయ నాయకురాలు, ఎంపీ శ్రీమతి
హైదరాబాద్: రోజురోజుకూ స్త్రీలపై పెరుగుతున్న దాడులు, లైంగికదాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఐద్వా జాతీయ నాయకురాలు, ఎంపీ శ్రీమతి డిమాండ్ చేశారు. స్త్రీ సమానత్వం కోసం ఉద్యమించాలని ఆమె పిలుపునిచ్చారు. ఆదివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఐద్వా తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రథమ మహాసభలో శ్రీమతి మాట్లాడారు. లైంగికదాడుల్లో దేశ రాజధాని ఢిల్లీ అగ్రస్థానంలో ఉందని, నిర్భయ ఘటనే దీనికి నిదర్శనమన్నారు. నిర్భయ చట్టానికి ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లు కేటాయించిందని, ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న దాడులకు సంబంధించి 60 శాతం వరకు కేసులు నమోదు కావడం లేదన్నారు. మహిళలపై దాడులు పెరగడం వల్ల స్త్రీల సంఖ్య తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
హర్యానాలో యువకులు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరక్క రాబోయే ఎన్నికల్లో పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు కావాలనే ప్రత్యేక డిమాండ్‌ను పెట్టనున్నారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం పెంచి పోషిస్తున్న మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ ప్రవేశ పెట్టాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి జగ్మతి మాట్లాడుతూ.. దేశంలో మహిళలకు రక్షణ కరువైందని, చట్టాలున్నా సక్రమంగా అమలు కాకపోవడంతో మహిళలకు న్యాయం జరగడం లేదన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ మద్యం అమ్మకాలు పెరగడం వల్ల నేరాల సంఖ్య పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్తగా కల్లు దుకాణాలను తెరిపించారని విమర్శించారు.