తీరని అనుమానాలు.. తేలని వివాదాలు...
మితిమీరిన స్థాయిలో వ్యాధినిరోధక ఔషధాలను తీసుకోవడం వల్లనే సునంద మరణించారని ఎయిమ్స్ పోస్టుమార్టమ్ నివేదిక పేర్కొంది. అందుకే ఇపుడు సుధీర్‌గుప్తా ఆరోపణలకు విలువ లేకుండా పోయింది.
ఏదో ఒకటి చేసి అందరి దృష్టినీ ఆకర్షించాలనుకుంటారు కొందరు... సంచలనం సృష్టించైనా అనునిత్యం వార్తల్లో ఉం డాలనుకుంటారు మరికొందరు... అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా వీటిలో రెండోకోవకు చెందినవానిగా కనిపిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ భార్య సునందా పుష్కర్ మృతిపై ఆయన రేకెత్తించిన తాజా వివాదం ఇందుకు నిదర్శనం. సునందది సహజమరణమే నంటూ నివేదిక ఇవ్వాలని తమపై ఒత్తిడి జరిగిందని, పోస్టు మార్టమ్ నివేదికలో మార్పు కోసం తమను ఒత్తిడి చేశారని సుధీర్ చెప్పడం మీడియాలో సంచలనం సృష్టించింది.
పోస్టుమార్టమ్ నిర్వహించిన డాక్టర్ల బృందానికి డాక్టర్ సుధీర్ గుప్తానే నేతృత్వం వహించారు. నివేదిక ఆయనే ఇచ్చారు. అంటే ఆమెది సహజమరణం కాకపోయినా సహ జమరణంగా వారు నివేదిక ఇచ్చారా? అసలు సుధీర్‌గుప్తా మాటలకు ఇపుడు ఏం విలువ ఉంటుంది? ఇంతకాలం ఆయన ఎందుకు ఊరుకున్నారు? ఇప్పుడు ఆయన వద్ద ఎలాంటి సాక్ష్యాధారాలున్నాయని ఈ ఆరోపణ చేస్తున్నారు? అసలు నివేదికను మార్చాల్సిందిగా సుధీర్‌పై ఒత్తిడి తీసుకువచ్చినవారెవరు? ఇలాంటి ప్రశ్నలకు మాత్రం సమా ధానాల్లేవు. సుధీర్‌గుప్తా చేస్తున్న ఆరోపణలను ఎయిమ్స్ ప్రతినిధులు నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నారు. సుధీర్ వ్యవహా రశైలి సరైంది కాదని, సంచలనాలకు ఆయన ప్రాధాన్యమి స్తుంటారని, అందుకే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారని ఎయిమ్స్ వర్గాలంటున్నాయి.
అయితే సునంద ఉదంతం వివాదాలకతీతమేమీ కాదు నిజానికి ఆమె మరణంపై అప్ప ట్లోనే అనేక అనుమానాలొచ్చాయి. వాటిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోంది కూడా. అప్పట్లో కాంగ్రెస్ అధికా రంలో ఉండడం వల్ల దర్యాప్తుపై అధికారపక్ష ప్రభావం ఉండి ఉంటుందన్న ఆరోపణలు వచ్చాయి. కానీ మితిమీరిన స్థాయిలో వ్యాధినిరోధక ఔషధాలను తీసుకోవడం వల్లనే సునంద మరణించారని ఎయిమ్స్ పోస్టుమార్టమ్ నివేదిక పేర్కొంది. అందుకే ఇపుడు సుధీర్‌గుప్తా ఆరోపణలకు విలువ లేకుండా పోయింది. అయితే అసలు ఈ సుధీర్‌గుప్తా ఎవరు... ఆయన వ్యవహారశైలి ఎలాంటిది అనేదానిపై ఆసక్తి కలగడం సహజమే.
ఎయిమ్స్‌లో కీలకమైన స్థానంలో ఉన్న సుధీర్‌గుప్తా తన వార్షిక నివేదికలలో కూడా ఇలాంటి సంచలనాలకే ప్రాధాన్యమిస్తుంటారట. 1996లో సీనియర్ డిమాన్స్ట్రే టర్గా ఉన్న గుప్తా ఆనాటి ఎయిమ్స్ డెరైక్టర్‌పై ఆరోపణల వర్షం కురిపిస్తూ రాసిన లేఖలు అప్పట్లో పెను సంచలనం. సుధీర్‌ది సమతుల్యత లేని వ్యక్తిత్వమని 2010లో అప్పటి ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ టీడీ డోగ్రా లేఖరాశారు. అంతేకాదు సుధీర్ అలవోకగా అబద్ధాలాడేస్తారని, నమ్మ దగిన వ్యక్తి కాదని, గొడవలు పెట్టుకునే మనస్తత్వమని, అస్సలు క్రమశిక్షణ లేనివాడని ఆ లేఖలో డోగ్రా ఘాటు విమర్శలు చేశారు. మెడికల్ రిజిస్టర్ నుంచి గుప్తా పేరును తొలగించాలంటూ 2004లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎథిక్స్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. ఆ వివాదం ఐదేళ్ల పాటు కొనసాగింది. అందుకే సుధీర్ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలకు ఎయిమ్స్ అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
ఇక సునంద మరణంపై రేకెత్తిన తాజా వివాదాగ్నిలో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా తోచినంత ఆజ్యం పోస్తున్నారు. ఆమెది సహజమరణం కాదని, ఆమెను రష్యా విషంతో హత్య చేశారని స్వామి పేర్కొంటున్నారు. అందుకు సంబంధించి తన వద్ద గట్టి సాక్ష్యాధారాలున్నాయని కూడా ఆయన అంటున్నారు. ఆధారాలుంటే ఆయన తక్షణం ఈ కేసు విచారిస్తున్న ఢిల్లీ పోలీసులకు అందజేయడం సబబు కదా! అసలు ఆధారాలున్నపుడు ఆయన ఇన్నాళ్లూ ఎందుకు ఊరుకున్నట్లు? అసలు సుధీర్ గుప్తా వివాదం రేకెత్తించే వరకు ఎందుకు ఆగినట్లు? నెహ్రూ గాంధీ కుటుంబంపై అనేక ఏళ్లుగా అటు న్యాయస్థానాల్లోనూ, ఇటు రాజకీయం గానూ పోరాడుతున్న స్వామి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే సునంద మరణం వెనుక ఐపీఎల్ రహస్య ఒప్పందాల గుట్టుమట్లు న్నాయని, సోనియా అల్లుడు రాబర్ట్ వాధ్రా ఉన్నాడని స్వామి గతంలో పలుమార్లు ఆరోపణలు చేశారు.
ఏది ఏమైనా సునందా పుష్కర్ మరణంలో లోకానికి తెలియని చీకటి కోణాలనేకం ఉన్నాయనే చర్చ ఇప్పటిది కాదు. అందుకే ఈ వ్యవహారంలో ఇప్పటికైనా నిష్పాక్షిక విచారణ జరిపించి నిజానిజాలు నిగ్గు తేల్చాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి. సంచలనం కోసం, వ్యక్తిగత మైలేజీ కోసం పాకులాడకుండా సుధీర్‌గుప్తా, సుబ్రహ్మణ్యస్వామి వంటి వారు ఈ కేసు దర్యాప్తు సవ్యంగా సాగేందుకు సహకరిస్తే మంచిది.
-పోతుకూరు శ్రీనివాసరావు