రూ.32.5 లక్షల నగదు స్వాధీనం
తిరుపతి క్రైం, న్యూస్‌లైన్: ఎయిర్ బైపాస్ రోడ్డులో గురువారం రాత్రి జరిపిన వాహన తనిఖీల్లో ఎలాంటి ఆధారాలూ లేని రూ.32.5 లక్షల నగదు, కారును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ గిరిధర్ తెలిపారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. స్టేషన్లో శుక్రవారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల వైపు నుంచి ఎయిర్‌బైపాస్ రోడ్డులోకి వెళుతున్న ఏపీ 29ఏసీ 5778 నెంబరు ఇండికా కారు ను తనిఖీ చేయగా నగదు దొరికిందని, దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నామన్నారు.
కారులో ఉన్న మహారాష్ట్రకు చెందిన సూరజ్ భాస్కర్, తొడిగి మహేష్, ఆర్సీపురం మండలం సొరకాయలపాళెంకు చెందిన వెంకటముని, తిరుపతి మిట్టవీధికి చెందిన ఆశోక్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.