Ajlan Shah Cup hockey tournament
-
భారత్‌కు రెండో పరాజయం
► కివీస్ చేతిలో 1-2తో ఓటమి ► మలేసియాపై నెగ్గితేనే ఫైనల్‌కు ► అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీ ఇపో (మలేసియా): ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్‌కు చేరుకోవాలని ఆశించిన భారత హాకీ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్లో టీమిండియాకు రెండో పరాజయం ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 1-2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. న్యూజిలాండ్ తరఫున కెన్ రసెల్ (28వ ని.లో), నిక్ విల్సన్ (41వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... భారత్‌కు మన్దీప్ సింగ్ (36వ ని.లో) ఏకైక గోల్‌ను అందించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 15 పాయిం ట్లతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకోగా... తమ నిర్ణీత ఆరు మ్యాచ్‌లను పూర్తి చేసుకున్న న్యూజిలాండ్ 11 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత్ తొమ్మిది పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఫలితంగా భారత్ ఫైనల్‌కు చేరాలంటే ఆతిథ్య మలేసియా జట్టుతో శుక్రవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏడు జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు స్వర్ణం కోసం... మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు కాంస్యం కోసం పోటీపడతాయి. పాకిస్తాన్‌పై భారీ విజయం సాధించి జోరుమీదున్న భారత్‌కు కివీస్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. తొలి క్వార్టర్లో గోల్ నమోదు కాకపోయినా... రెండో క్వార్టర్లో కివీస్ ఖాతా తెరిచింది. అయితే భారత్ స్కోరును సమం చేయడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. భారత రక్షణపంక్తి ఆటగాళ్ల మధ్య సమన్వయ లోపాన్ని సద్వినియోగం చేసుకున్న కివీస్ రెండో గోల్‌ను సాధించి ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి నిమిషాల్లో భారత్‌కు రెండు పెనాల్టీ కార్నర్లు లభించినా ఫలితం లేకపోయింది. -
మరో విజయంపై భారత్ దృష్టి
ఇఫో(మలేసియా): అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్లో భారత్ మరో విజయంపై దృష్టి పెట్టింది. తొలి మ్యాచ్‌లో జపాన్‌పై గెలిచిన టీమిండియా... రెండో మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. రెండు రోజుల విరామం తీసుకున్న భారత్... ఆదివారం తమ మూడో మ్యాచ్‌ను కెనడా జట్టుతో ఆడనుంది. తండ్రి మరణం కారణంగా మొదటి రెండు మ్యాచ్‌ల్లో జట్టుకు దూరమైన స్టార్ మిడ్‌ఫీల్డర్ మన్‌ప్రీత్‌సింగ్ జట్టుతో చేరాడు. శనివారం ఉదయం నిర్వహించిన ట్రైనింగ్ సెషన్లో అతను పాల్గొన్నాడు. మన్‌ప్రీత్ చేరికతో భారత మిడ్‌ఫీల్డ్ విభాగం పటిష్టమైంది. కెప్టెన్ సర్దార్ సింగ్‌తో కలిసి మిడ్‌ఫీల్డ్‌లో కదిలే మన్‌ప్రీత్ అవసరమైతే డిఫెండర్‌గా కూడా ఆడతాడు. రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన కెనడా జట్టును తాము తక్కువ అంచనా వేయడంలేదని భారత కోచ్ రోలంట్ ఓల్ట్‌మన్స్ తెలిపారు. -
భారత్ శుభారంభం
► జపాన్‌పై 2-1తో గెలుపు ► అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీ ఇపో (మలేసియా): మాజీ చాంపియన్ భారత్... సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. జపాన్‌తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఒకదశలో 0-1తో వెనుకబడిన భారత్ ఆ తర్వాత తేరుకొని ఎనిమిది నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన జపాన్ నుంచి ఆద్యంతం భారత్‌కు గట్టిపోటీ ఎదురైంది. ఆట 17వ నిమిషంలో కెంజి కిటాజాటో గోల్‌తో జపాన్ ఆధిక్యంలోకి వెళ్లింది. లభించిన తొలి పెనాల్టీ కార్నర్‌నే జపాన్ గోల్‌గా మలచడం విశేషం. ఆ తర్వాత భారత ఆటగాళ్లు ప్రత్యర్థి వలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. 24వ నిమిషంలో లభించిన తొలి పెనాల్టీ కార్నర్‌ను కుడి వైపునకు డ్రాగ్ ఫ్లిక్ చేసి హర్మన్‌ప్రీత్ సింగ్ భారత్‌కు మొదటి గోల్‌ను అందించాడు. ఆ తర్వాత ఆట 32వ నిమిషంలో జస్జీత్ సింగ్ అందించిన పాస్‌ను అందుకున్న సర్దార్ సింగ్ రివర్స్ షాట్‌తో జపాన్ గోల్ కీపర్‌ను బోల్తా కొట్టించాడు. దాంతో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్ ముగిసేలోపు భారత్‌కు మరిన్ని గోల్స్ చేసే అవకాశాలు లభించినా ఫలితం లేకపోయింది. సహచర ఆటగాడు మన్‌ప్రీత్ సింగ్ తండ్రి మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో నల్ల రిబ్బన్ బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటలముందు మన్‌ప్రీత్ సింగ్ తండ్రి మృతి చెందినట్లు సమాచారం అందింది. దాంతో మన్‌ప్రీత్ స్వదేశానికి బయలుదేరి వెళ్లాడు. గురువారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది.