భారత్‌కు రెండో పరాజయం | A second defeat of India- Ajlan Shah Cup hockey tournament | Sakshi
Sakshi News home page

భారత్‌కు రెండో పరాజయం

Published Thu, Apr 14 2016 12:49 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM

భారత్‌కు రెండో పరాజయం

భారత్‌కు రెండో పరాజయం

కివీస్ చేతిలో 1-2తో ఓటమి
మలేసియాపై నెగ్గితేనే ఫైనల్‌కు
అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీ

 
ఇపో (మలేసియా): ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్‌కు చేరుకోవాలని ఆశించిన భారత హాకీ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్‌లో టీమిండియాకు రెండో పరాజయం ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 1-2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. న్యూజిలాండ్ తరఫున కెన్ రసెల్ (28వ ని.లో), నిక్ విల్సన్ (41వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... భారత్‌కు మన్‌దీప్ సింగ్ (36వ ని.లో) ఏకైక గోల్‌ను అందించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 15 పాయిం ట్లతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకోగా... తమ నిర్ణీత ఆరు మ్యాచ్‌లను పూర్తి చేసుకున్న న్యూజిలాండ్ 11 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత్ తొమ్మిది పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఫలితంగా భారత్ ఫైనల్‌కు చేరాలంటే ఆతిథ్య మలేసియా జట్టుతో శుక్రవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏడు జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు స్వర్ణం కోసం... మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు కాంస్యం కోసం పోటీపడతాయి.
 పాకిస్తాన్‌పై భారీ విజయం సాధించి జోరుమీదున్న భారత్‌కు కివీస్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. తొలి క్వార్టర్‌లో గోల్ నమోదు కాకపోయినా... రెండో క్వార్టర్‌లో కివీస్ ఖాతా తెరిచింది.

అయితే భారత్ స్కోరును సమం చేయడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. భారత రక్షణపంక్తి ఆటగాళ్ల మధ్య సమన్వయ లోపాన్ని సద్వినియోగం చేసుకున్న కివీస్ రెండో గోల్‌ను సాధించి ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి నిమిషాల్లో భారత్‌కు రెండు పెనాల్టీ కార్నర్‌లు లభించినా ఫలితం లేకపోయింది.

Advertisement
Advertisement