కోతలపై రైతన్న కన్నెర్ర
రామగుండం/చందుర్తి, న్యూస్‌లైన్ : వేళాపాళా లేని విద్యుత్ కోతలతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతికి వచ్చే దశలో పంటలకు నీరందక ఎండిపోతుంటే తట్టుకోలేక రోడ్డెక్కుతున్నారు. అధికారుల తీరుపై మండిపడుతూ సబ్స్టేషన్లను ముట్టడించి ఆందోళనకు దిగుతున్నారు. సోమవారం రామగుండం, చందుర్తి మండలాల్లో విద్యుత్ సబ్స్టేషన్లను ముట్టడించి అధికారులను నిలదీశారు.
రామగుండం మండలం బ్రాహ్మణపల్లి, ఆకెనపల్లి, సోమనపల్లి, మర్రిపల్లికి చెందిన రైతులు ఆకెనపల్లి సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. నిర్దేశిత సమయంలో ఇవ్వాల్సిన కరెంటు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని వాపోయారు.
ఇచ్చే ఐదు గంటల కరెంటైనా సక్రమంగా ఇస్తే బాగుండునని, అధికారుల తీరుతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల వారీగా నాలుగు గ్రూపులుగా విభజించి, ఐదు గంటలు త్రీఫేస్ ద్వారా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామన్న అధికారులు గంటన్నర కూడా కరెంటు ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఆందోళనలో సింగిల్‌విండో డెరైక్టర్ బండారు ప్రవీణ్‌కుమార్, రాయమల్లు, రామస్వామి, దుర్గం రాజేశ్, మల్లేశ్, దేవి శంకర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.