చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలి
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి
ఆర్డీవో కార్యాలయం వద్ద రజకుల వినూత్న నిరసన
తిరుపతి(మంగళం) : సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన వెంటనే రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తానంటూ చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అఖిల భారతీయ దోబీ మహా సమాజ్ ఏపీ రాష్ట్ర శాఖ కన్వీనర్ అక్కినపల్లి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. తిరుపతి ఆర్డీ వో కార్యాలయం వద్ద సోమవారం రజకులు అర్ధనగ్నంగా బట్టలు ఉతకడం, ఉడకబెట్టడం, ఆరబెట్టడం వంటి వినూత్న కార్యక్రమాలతో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అక్కినపల్లి లక్ష్మయ్య మాట్లాడు తూ రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తానని మాట ఇచ్చిన చంద్రబాబునాయుడు ఇంతవరకు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఇప్పటికైనా రజకులను ఎస్సీ జాబితా లో చేర్చాలని డిమాండ్ చేశారు.
భారతదేశంలోని 18 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారని, ఇక్కడ మాత్రం బీసీలుగా ఉండి కులవృత్తితో జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడం వలన అన్ని విధాలా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయన్నారు. రజక మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా తమను పట్టించుకునే వారే లేరన్నారు. అనంతరం ఆర్డీ వో కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రంగస్వామికి రజకులు వినతిపత్రం సమర్పించారు. వివిధ రజక సంఘాల నాయకులు గంధం బాబు, హరిప్రసాద్, దాము, కుమారస్వామి, శంకరయ్య, మురళి, శ్రీనివాసులు, సంపూర్ణమ్మ, సుబ్రమణ్యం పాల్గొన్నారు.