ఇసుక లోడు రూ.840
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలోని 12 ఇసుక క్వారీలకు ప్రభుత్వం త్వరలో అనుమతి ఇవ్వనుంది. అలాగే ఇసుక లోడు రూ.840లుగా నిర్ణయించింది. రాష్ట్రంలో రెచ్చిపోయిన ఇసుక మాఫియాను కట్టడిచేసేందుకు ప్రభుత్వం ఇసుక క్వారీలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అలాగే ఇసుక అమ్మకాలపై నిషేధం విధించింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజల విజ్ఞప్తుల మేరకు 12 క్వారీలకు అనుమతులు మంజూరు చేయడం ద్వారా అమ్మకాలకు మళ్లీ శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని కొందరు క్వారీ యజమానులు తమ పర్మిట్ల పరిధికి మించి ఇసుక రవాణాను సాగించారు. గడువు ముగిసిపోయినా యథేచ్ఛగా అమ్మకాలు జరిపారు. రాష్ట్రంలోని ఇసుక పొరుగు రాష్ట్రాలకు అక్రమంగా తరలిపోయింది. ఇసుక మాఫియాపై జిల్లా కలెక్టర్లు విరుచుకుపడగా ప్రభుత్వం వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా నిషేధం విధించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిషన్ వేసి విచారణ చేపట్టింది. దీంతో అనేక అక్రమ క్వారీల కార్యాలయాలకు సీలు వేశారు. ఒకవైపు నిషేధం కొనసాగుతున్నా మరోవైపు అక్రమంగా ఇసుక తరలిపోతోందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 12 క్వారీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరువళ్లూరు, కడలూరు, విళుపురం జిల్లాల్లో అమ్మకాలకు అనుమతులు మంజూరు చేయనుంది. అలాగే ఒక లోడు ఇసుక రూ.840లుగా ప్రభుత్వం నిర్ణయించింది.