అంబటి నారాయణరెడ్డి కన్నుమూత
అనంతపురం : అనంతపురం మాజీ మునిసిపల్ చైర్మన్ అంబటి నారాయణరెడ్డి (84) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం వేకువజామున ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈయన రెండు పర్యాయాలు మునిసిపల్ చైర్మన్‌గా పని చేశారు. 1981 నుంచి 83 వరకు మొదటిసారి, 1987–92 దాకా మరోసారి పని చేశారు. మునిసిపల్ చైర్మన్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా కూడా చేశారు.
యాడికి మండలం తిప్పారెడ్డిపల్లి ఈయన సొంతూరు. నారాయణరెడ్డికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. కుమారుడు అంబటి ఆదినారాయణరెడ్డి మునిసిపల్ వైస్ చైర్మన్‌గా పని చేశారు. నారాయణరెడ్డి మృతి సమాచారం తెలుసుకున్న పలువురు నేతలు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్‌రెడ్డి, వై. ప్రభాకర్ చౌదరి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, భూపాల్‌రెడ్డి, రామిరెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తోపుదుర్తి కవిత, వైఎస్సార్సీపీ క్రమశిక్షణ సంఘం సభ్యులు ఎర్రిస్వామిరెడ్డి, నగర మేయర్ స్వరూప, మాజీ మేయర్ రాగే పరుశురాం, మార్కెట్‌యార్డ్ చైర్మన్ ఆదినారాయణ, వైఎస్సార్సీపీ నాయకులు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, చవ్వా రాజశేఖర్‌రెడ్డి, మీసాల రంగన్న, నార్పల సత్యనారాయణరెడ్డి, అనంత చంద్రారెడ్డి, మార్కెట్ యార్డు మాజీ ఉపమేయర్ బండి శ్రీరాములు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఫకృద్దీన్ తదితరులు సంతాపం తెలిపినవారిలో ఉన్నారు.