‘నకిలీ’ టీచర్లు!
- తప్పుడు బోనఫైడ్లతో ఉద్యోగాలు!
- 45 మందిపై యంత్రాంగానికి ఫిర్యాదులు
- పూర్తిస్థాయి విచారణకు ఆదేశించిన కలెక్టర్
జిల్లా విద్యాశాఖలో మరో ‘నకిలీ’ బాగోతం వెలుగుచూసింది. తప్పుడు ధ్రువీకరణపత్రాలతో ఉద్యోగాలు కొట్టేసిన తంతు మర్చిపోకముందే మరో నాటకం తెరపైకి వచ్చింది. గతనెలలో కల్పిత మార్కుల జాబితాలతో కార్యాలయ సబార్డినేట్ ఉద్యోగాలు దక్కించుకున్న 14 మందిని టర్మినేట్ చేశారు. ఈ క్రమంలో ఇలాంటి అంశాలపై కఠినంగా స్పందించాలని యంత్రాంగం సంకల్పించిన నేపథ్యంలో.. తాజాగా నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లతో జిల్లాలో పదుల సంఖ్యలో టీచర్ ఉద్యోగాలు సొంతం చేసుకున్నట్లు బయటపడింది. ‘స్థానిక’ కోటాలో భర్తీ చేసిన ఉపాధ్యాయ పోస్టులను 45 మంది స్థానికేతరులు బూటకపు బోనఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించి కొల్లగొట్టినట్లు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పూర్తిస్థాయి విచారణకు యంత్రాంగం ఉపక్రమించింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అన్ట్రైన్డ్ డీఎస్సీ-2002లో కేవలం స్థానిక అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించారు. అదేవిధంగా 2006లో నిర్వహించిన డీఎస్సీల్లోనూ స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యతనిస్తూ నియామకాలు చేపట్టారు. అయితే ఈ రెండు డీఎస్సీ ల్లో స్థానికేతర అభ్యర్థులకు పెద్దగా అవకాశం దక్కలేదు. దీంతో అత్యధిక పోస్టులుండి.. పోటీ తక్కువగా ఉండడంతో స్థానికేతరులు జిల్లాలో పాగావేస్తూ వ చ్చారు. ఈ పరిస్థితుల్లోనే నకిలీ బోనాఫైడ్లు తయారుచేసి ఉద్యోగాలు పొందినట్లు అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదుల్లో 2002, 2006 సంవత్సరాల్లో నిర్వహించిన డీఎస్సీలకు సంబంధించినవే.
శివారు మండలాల నుంచే..
నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందిన విషయంలో 45 మందిపై ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ప్రాథమిక దర్యాప్తులో ఐదింటిని యంత్రాంగం తిరస్కరించింది. మిగిలిన 40 ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని కలెక్టర్ రఘునందన్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుల్లో గండేడ్, కుల్కచర్ల, దోమ, పరిగి, హయత్‌నగర్, ఘట్కేసర్ మండలాల నుంచి బోగస్ బోనాఫైడ్‌లో పొందినట్లు ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల వారీగా విచారణ చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో బదిలీల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత అధికారులు పూర్తిస్థాయి విచారణకు దిగి అక్రమాలపై నిగ్గు తేల్చనున్నారు.
10 మందిపై క్రిమినల్ కేసులు
వివిధ శాఖల్లో పనిచేస్తున్న 13 మంది ఆఫీస్ సబార్డినేట్లను జిల్లా యంత్రాంగం ఇటీవల టర్మినేట్ చేసిన సంగతి తెలిసిందే. వీరంతా నకిలీ మార్కుల సర్టిఫికెట్లు సమర్పించనట్లు విచారణలో తేలడంతో ఈమేరకు యంత్రాంగం చర్యలు తీసుకుంది. తాజాగా వీరిపై క్రిమినల్ కేసుల నమోదుకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా 10 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు వారి నుంచి రెవెన్యూ రికవరీ సైతం చేపట్టేలా చర్యలు తీసుకుంటోంది.