అన్నభాగ్య!
పట్టణ పేదలకు రేషన్ కట్
దసరా, బక్రీద్ తర్వాత అమల్లోకి?
కిరోసిన్ రహిత పట్టణ ప్రాంతాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
సాక్షి, బెంగళూరు : అడిగిన సమాచారం ఇవ్వని వారికి సబ్సిడీ సరుకులను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే తొలిదశలో పట్టణాల్లో ఉంటున్న బీపీఎల్, అంత్యోదయ కార్డుదారులకు చౌకదుకాణాల నుంచి అందించే రేషన్‌ను నిలిపి వేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అనర్హులను గుర్తించడంతో పాటు కిరోసిన్ రహిథ పట్టణ ప్రాంతాలుగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలకు దిగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇదే గనుక జరిగితే పట్టణాల్లోని పలువురు పేదలు అన్నభాగ్య పథకానికి దూరం కానున్నారు. ప్రస్తుతం రాష్ట్ర మొత్తం మీద కోటి కుటుంబాలు రేషన్ షాపుల నుంచి ప్రతి నలా సబ్సిడీ సరుకులను పొందుతున్నాయి. లబ్ధిదారుల్లో మొత్తం 9,17,987 మంది పట్టణప్రాంతాల్లో(వీరిలో 65,061 మంది అంత్యోదయ లబ్ధిదారులు) నివసిస్తున్నట్లు పౌరసరఫరాలశాఖ గణాంకాలు చెబుతున్నాయి.
అంతేకాకుండా 35 లక్షల మంది కొత్తగా బీపీఎల్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి ఎన్నికల కమిషన్ అందజేసే ఎలొక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డ్ (ఎపిక్ కార్డు)తోపాటు ఆధార్ నంబర్‌ను జత చేయడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలు జారీచేసింది. మరోవైపు ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారికి వెంటనే ఆధార్, ఎపిక్‌నంబర్‌ను ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ దాదాపు రెండు నెలల ముందే సూచించింది. ప్రభుత్వం అడిగిన సమాచారం
ఇచ్చినవారు ఇప్పటికీ లక్షను దాటలేదు. దీంతో సమాచారం ఇవ్వని వారికి రేషన్ నిలిపివేయాలని పౌరసరఫరాల శాఖ భావిస్తోంది.
ఇందుకోసం మొదట పట్టణ ప్రాంతాల్లో ఈ నిబంధన అమలు చేసి తర్వాత గ్రామీణ ప్రాంతాలకు వర్తింపజేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు పట్టణప్రాంతాల్లో సబ్సిడీ ధరలో కిరోసిన్ పొందే వారిని గుర్తించి సరైన గణాంకాలు కేంద్రానికి ఇచ్చినప్పుడు మాత్రమే ఆ మేరకు కేంద్రం నుంచి అదనపు గ్యాస్ పొందడానికి వీలవుతుంది.
ఈ ప్రక్రియ ఎంత వేగంగా జరిగితే అంత వేగంగా కర్ణాటకను కిరోసిన్ రహిత పట్టణ ప్రాంతాల రాష్ట్రంగా చేయడానికి వీలవుతుంది. దీంతో ‘ఆధార్’ను రేషన్ కార్డుకు అనుసంధానం చేయడం వల్ల లబ్ధిదారుల సంఖ్యలో ఖచ్చితత్వం పెరుగుతుందనేది పౌరసరఫరాలశాఖ భావన. దీనికి సంబంధించిన ఫైల్ పదిహేను రోజుల ముందే ప్రభుత్వానికి చేరింది.
అయితేదసరా, బక్రీద్ పండుగలు వచ్చే నెల మొదట్లోనే వస్తుండడంతో ఈ నిబంధన వల్ల రేషన్ దొరక్కపోతే ప్రజల నుంచి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వస్తుందని ఫైల్‌పై ముఖ్యమంత్రి సంతకం చేయడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే నవంబర్ నుంచి ఈ నిబంధనలను అమలు చేయాలని పౌరసరఫరాల శాఖ పట్టుదలతో ఉంది.