3 నుంచి ‘పది’ మూల్యాంకనం
– ‘స్పాట్’ విధుల నుంచి మినహాయింపు ఉండదు!
– అందరూ విధిగా హాజరుకావాల్సిందే
– జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ
అనంతపురం ఎడ్యుకేషన్ : ఏప్రిల్ మూడో తేదీ నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) పగడాల లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్‌తో కలిసి డీఈఓ విలేకరులతో మాట్లాడారు. ఏప్రిల్ 3 నుంచి 16వ తేదీ వరకు మూల్యాంకనం ఉంటుందన్నారు. వివిధ జిల్లాల నుంచి ఇప్పటిదాకా జిల్లాకు 2.80 లక్షల జవాబుపత్రాలు వచ్చాయన్నారు. ఎగ్జామినర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల నుంచి మినహాయింపు ఉండదన్నారు. ఇప్పటికే ఎంపిక చేసి వారి వివరాలను ఆన్లైన్లో ఉంచామన్నారు. ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే సంబంధిత సర్టిఫికెట్లు తీసుకుని మూడో తేదీన వస్తే అలాంటి వారిని మినహాయిస్తామన్నారు.
అంతేకానీ ఒకరి ఆర్డరు మరో టీచరు తీసుకుని వస్తే మాత్రం ఇద్దరిపైనా చర్యలుంటాయని హెచ్చరించారు. ఆర్జేడీ కూడా ఉంటారన్నారు. ఆగస్టు లోగా ఉద్యోగ విరమణ పొందే ఉపాధ్యాయులకు స్పాట్ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. కనీసం మూడేళ్లు పదో తరగతి బోధించిన వారు అర్హులన్నారు. ఎవరైనా విధులకు హాజరుకావాలనుకునే వారు ఆరోజు నేరుగా రావచ్చన్నారు. తెలుగు సబ్జెక్టుకు 170 మంది, హిందీకి 115 మంది, ఇంగ్లిష్‌కు 250 మంది, గణితానికి 200 మంది, సైన్స్‌కు 240 మంది, సోషియల్కు 170 మంది, సంస్కృతంకు 30 మందిని ఎగ్జామినర్లను నియమించామన్నారు. అవసరాన్ని బట్టి ఇంకా తీసుకుంటామన్నారు.
రిలీవ్ చేయాలంటూ డీఈఓ సెల్‌కు మెసేజ్
ఎగ్జామినర్ల విధుల నుంచి కారణం లేనిదే ఏ ఒక్కరినీ రిలీవ్ చేయబోమని డీఈఓ పదేపదే చెబుతుంటే మరోవైపు హిందూపురం సేవా మందిరం పాఠశాలకు చెందిన సోషియల్ టీచరు నాగరాజు డీఈఓ మొబైల్‌కు మెసేజ్ పంపడం విశేషం. తనను ఎగ్జామినర్ విధుల నుంచి తప్పించాలంటూ అందులో పేర్కొన్నాడు. దీన్ని సీరియస్‌గా పరిగణించిన డీఈఓ సదరు టీచర్‌కు మెమో జారీ చేయాలంటూ సిబ్బందిని ఆదేశించారు.