బ్యాంకును దోచినా.. పాతనోట్లే వచ్చాయి!
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో నలుగురు సాయుధులు బ్యాంకు సిబ్బందిని బెదిరించి 13 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు. దొంగలు ప్రాణాలకు తెగించి దోపిడీకి పాల్పడినా వాళ్లకు దొరికింది పాత నోట్లే. దుండగులు దోచుకెళ్లిన నగదులో 11 లక్షల రూపాయల కరెన్సీ రద్దయిన 500, 1000 రూపాయల నోట్లు. చెలామణిలో ఉన్న నోట్లు 2 లక్షల రూపాయలు మాత్రమే దొరికింది. సోమవారం శ్రీనగర్‌కు 100 కిలో మీటర్ల దూరంలో ఉన్న మల్పోరాలోని జమ్ము కశ్మీర్ ప్రభుత్వ బ్యాంకులో దోపిడీ జరిగింది.
నలుగురు దుండగులు ముసుగులు ధరించి, ఆయుధాలతో బ్యాంకులోకి వెళ్లారు. అందినకాడికి నోట్లను తీసుకుని పారిపోయారు. అయితే దొంగలకు కొత్త నోట్లు లభించలేదు. ప్రజలు డిపాజిట్ చేసిన పాత నోట్లు దొరికాయి. దీంతో దుండగులు భారీ మొత్తంలో డబ్బు దోచుకెళ్లినా వారికి చెలామణి అయ్యేది 2 లక్షల రూపాయలే. ఉగ్రవాదులు ఈ దోపిడీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నల్లధనం, నకిలీ కరెన్సీని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే.