దినదిన గండం.. అక్కడ బతకడం
వారికి చెవులకు ప్రార్థనా గీతాలు వినిపించకపోవచ్చు.. కానీ తుపాకీ చప్పుళ్లు వినిపించని రోజుండదు.. దాహార్తికి అలమటించిన క్షణాలు ఉండొచ్చు.. కానీ మోర్టార్ గుళ్ల వర్షం కురవని క్షణాలు ఉండవు. అంతర్జాతీయ సరిహద్ధులోని 42 భారతీయ గ్రామాల్లోని ప్రజలు నిత్యం సమరమే.. ప్రతి క్షణం దినదిన గండమే. ఎప్పుడు తుపాకులు విరుచుకుపడతాయో.. ఏ క్షణంలో పాకిస్తాన్ ముష్కరమూకల మోర్గార్లు పేలుతాయో తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు అక్కడి ప్రజలు.
ఆర్నియా సెక్టార్.. జమ్మూ కశ్మీర్‌లోని పాక్ సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. ఈ సరిహద్దు వెంబడి 42 గ్రామాల్లో 45 వేల మంది ప్రజలు జీవిస్తున్నారు. మొత్తం 198 కిలోమీటర్ల ఈ సరిహద్దు ప్రజలు నిరంతరం పాక్ సైన్యం జరిపే కాల్పులకు బలి అవుతూనే ఉన్నారు. ఇరు దేశాల మధ్య 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా.. పాకిస్తాన్ మాత్రం దానిని ప్రతి రోజూ ఉల్లంఘిస్తోంది. పాక్ సైన్యం ఎప్పుడు మోర్టార్ కాల్పులకు తెగబడుతుందో.. ఏ అర్దరాత్రి.. ఏకే 47 తుపాకులు గుళ్ల వర్షం కురిపిస్తాయో తెలియక.. ఇళ్లలో కన్నా బంకర్లలోనే ప్రజలు కాలం గడుపుతున్నారు.
మోర్టార్ల బీభత్సం
కశ్మీర్ సరిహద్దు ప్రజలకు శాంతి అంటే.. మోర్టార్లు, తుపాకులు పేలడం అగడం వరకూ అని మాత్రమే తెలుసు. ఆగిన కొద్ది సేపటిలో పనులు పూర్తి చేసుకుని తిరిగి గుళ్ల వర్షం కురిసే లోపు.. సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలి. సెప్టెంబర్16-17 తేదీల్లో పాకిస్తాన్ సైన్యం ఆర్నియా సెక్టార్లోఅర్దరాత్రి కాల్పులకు తెగబడింది. ఈ సమయంలో సరిహద్దు గ్రామంలోని రత్నాదేవి (50) అనే మహిళకు బుల్లెట్లు తాకి అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై ఆమె భర్త చునాయి లాల్ మాట్లాడుతూ.. పాక్‌సైన్యం రాత్రంతా కాల్పులు జరుపుతూనే ఉందన్నారు. ఇటువంటివి ఇక్కడ ప్రతి రోజూ జరుగుతాయని చెప్పారు.
చిన్నారుల పరిస్థితి విషయం
సరిహధ్దు గ్రామాల్లోని చిన్నారుల పరిస్థితి మరీ విషయంగా ఉందని గ్రామస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర 16-17 తేదీల్లో పాక్ కాల్పుల్లో ఎనిమిది మంది చిన్నారులు తీవ్రగాయాల పాలయ్యారు. ఇక పాక్‌రేంజర్ల కాల్పుల్లో వందలాది మంది చిన్నారులు కాళ్లు, చేతులు కోల్పోవడం, చూపు దెబ్బతినడం జరిగిందని బాధితులు చెబుతున్నారు. ముఖ్యంగా పాక్‌రేంజర్లు 82, 120 ఎంఎం మోర్టార్లతో జరిపే కాల్పుల్లో ప్రమాదాల తీవ్రత అధికంగా ఉంటోందని వారు స్థానికులు చెబుతున్నారు.
భవిష్యత్ అగమ్యగోచరం
సరిహద్ధు ప్రాంతాల్లోని చిన్నారుల భవిష్యత్ అగమ్యగోచరమే. ఇక్కడి చిన్నారులు సాధారణ జీవితానికి చాలా దూరం. ఆర్నియా సబ్ సెక్టార్లో మొత్తం 33 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో 1500 మంది చిన్నారులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఈ పాఠశాలలు ఏడాది మొత్తం కొన్ని వారాలు మాత్రమే పనిచేస్తాయని.. స్థానికులు అంటున్నారు. చిన్నారులు స్వేచ్ఛగా తిరగడం, ఆడుకోవడం, చదువుకోవడం ఇక్కడ కుదరదు.
బంకర్లే ఆవాసాలు
సరిహద్దు గ్రామాల్లోని ప్రజలకు భారత సైన్యం ఏర్పాటు చేసిన బంకర్లే స్థిర నివాసాలుగా మారాయి. ఇక్కడ ఒక్కో బంకర్లో సగటున 7 వేల మంది ఉంటున్నారు. ఈ బంకర్లలోనే ప్రజలు నెలలతరబడి గడిపేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రభుత్వమే సరిహద్దు గ్రామాల్లోని ప్రతి ఇంటికి ఒక బంకర్‌ను నిర్మించింది. ప్రభుత్వం సుమారు రూ. 5లక్షలతో ఏర్పాటు చేసిన బంకర్ల తరువాత పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చిందని థోరు రామ్ (56) చెబుతున్నారు. మోర్టార్ శబ్దాలు మొదలవగానే.. మేమంతా బంకర్లలోకి వెళ్లిపోతామని ఆయన చెబుతున్నారు. ఇక రాజౌరీ జిల్లాల్లో 621 కమ్యూనిటీ బంకర్లను 8,197 వ్యక్తిగత బంకర్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించాయి.