లాకౌట్‌పై స్పష్టత ఇవ్వకపోతే ముట్టడే
విజయనగరం టౌన్ : అరుణా జ్యూట్‌మిల్లును అక్రమంగా లాకౌట్ చేసి ఐదు నెలలు కావస్తోందని, మిల్లు తెరుస్తారా.. లేక పూర్తిగా మూసేస్తారా అన్న దానిపై స్పష్టత ఇవ్వాలని ఏఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు బి.శంకరరావు డిమాండ్ చేశారు. కార్మికుల ఓట్లతో గెలిచిన మంత్రులు పూసపాటి అశోక్‌గజపతిరాజు, మృణాళినిలు 15 రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే వారు చేసే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం విజయనగరం వి.టి.అగ్రహారం అరుణా మిల్లు వద్ద జాతీయ రహదారిపై నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం వై జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించకపోవడం దారుణమన్నారు. వ్యవసాయాధారిత జూట్ పరిశ్రమలు మూతపడి వేలాది మంది కార్మికులు వీధిన పడినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు.
జపాన్, సింగపూర్ల జపం చేస్తూ విదేశీ పెట్టుబడులు వస్తున్నాయంటూ మభ్యపెడుతూ దేశీయ పరిశ్రమల గొంతు నులుముతున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో యూని యన్ ప్రధాన కార్యదర్శి పి.శ్రీను, ఆర్.అప్పారావు, ఆర్.ఆదినారాయణ, డి.రామారావు, జి.విజయరామరాజు, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.