కిటకిటలాడిన ఏఎస్పేట దర్గా
అనుమసముద్రంపేట:ఏఎస్పేటకు శనివారం సైతం పెద్దయెత్తున భక్తులు, యాత్రికులు తరలివచ్చారు. వందలాది ప్రత్యేక వాహనాల్లో వచ్చిన భక్తులుతో దర్గా పరిసరాలు, ప్రధాన వీధులు కిక్కిరిశాయి. దర్గాలోని శ్రీహజ్రత్ సయ్యద్ ఖాజారహంతుల్లా నాయబ్రసూల్, అమ్మాజీల సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గలేపులు, పూల దుప్పట్లు కప్పారు. దర్గా సజ్జాదానషీన్ షాగులాం నక్షాబంద్ హఫీజ్పాషా ప్రత్యేక గీతాలు ఆలాపించారు. దర్గా ట్రస్టీ ఆధ్వర్యంలో తాగునీటి వసతి, అన్నదానం చేశారు. యాత్రికులతో దుకాణాలు కొత్త కళ సంతరించుకున్నాయి. ఆత్మకూరు ఆర్టీసీ అధికారులు శనివారం ప్రత్యేక బస్సులను తగ్గించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పంచాయతీ కార్యదర్శి అప్పాజీ పారిశుద్ధ్య పనులు పలువీధుల్లో చేయించారు. అయితే వైద్యశాల వీధి, బలిజవీధి, పడమర వీధుల్లో సక్రమంగా పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించలేదని ఆయా ప్రాంతాల ప్రజలు ఆరోపించారు.