Asrayaakrti school
-
వినండి.. మాట్లాడండి
అమ్మా అని నోరారా పిలిస్తే..ఆ తల్లికి చెప్పలేని సంతోషం. నాన్నా అంటూ పిలిస్తే ఆ తండ్రికి ఎనలేని ఆనందం. ఈ పిలుపు కోసమే తల్లిదండ్రులు తపనపడుతుంటారు. అయితే పిల్లలుండీ మాట్లాడలేని..వినలేని స్థితిలో ఉంటే వారి వేదన వర్ణణాతీతం. అలాంటి మూగ..చెవిటి పిల్లల్ని చేరదీసి...వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ‘అమ్మా..నాన్నా’ అని పిలిచేలా చేస్తూ, వారికి విద్యను అందిస్తూ, ఉన్నతంగా తీర్చుదిద్దుతోంది ఆశ్రయ్..ఆకృతి సంస్థ. పుట్టుకతోనే మాట్లాడలేని, వినలేని చిన్నారులను చేరదీసి వారికి విద్యా బోధన అందిస్తూ, పెదవులుదాటి మాటలు బయటకు రాని ఎందరో పిల్లలకు మాటలు వచ్చేలా చేస్తూ వారిలో మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తోంది. కుల మతాలకతీతంగా ఎలాంటి ఫీజులు లేకుండా పూర్తి ఉచిత సేవలు అందిస్తోంది. – శ్రీనగర్‌కాలనీ శ్రీనగర్‌కాలనీలో 1996లో నలుగురు పిల్లలతో సంస్థ డైరెక్టర్ డీపీకే బాబు వ్యవస్థాపకుడిగా స్థాపించిన ఆశ్రయ్..ఆకృతి ఫౌండేషన్ సంస్థ ఇప్పుడు సుమారు 650 మంది పిల్లలు, ఐదు బ్రాంచ్‌లతో బధిరులకు ఓ వరంలా మారింది. నిపుణులైన టీచర్లతో శిక్షణనిస్తూ పుట్టు మూగైనా ఎందరో బుడిబుడి చిన్నారులు మాట్లాడేలా చేస్తున్నారు. వారి తల్లులను అమ్మా అని పిలిచేలా తీర్చిదిద్దుతున్నారు. సాధారణ చిన్నారులతో పోల్చుకుంటే చెవిటి, మూగ చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. అయితే ఇక్కడ నైపుణ్యంతో పాటు సుశిక్షుతులైన టీచర్లను నియమించి చిన్నారులకు అర్ధం చేసుకునేందుకు వీలుగా ‘ఓరల్ మెథడ్’ ద్వారా..బొమ్మల ద్వారా విద్యా బోధన చేపడుతున్నారు. సేవా బాటలో... చిన్నారులకు ఉచిత విద్యను అందిస్తూనే సేవా కార్యక్రమాల్లో ఆశ్రయ్–ఆకృతి సంస్థ ముందుంటోంది. లక్షల్లో ఖర్చయ్యే కాంక్లియర్ సర్జరీలను ఉచితంగా చేయిస్తుంది. నగరంలోని పలు బ్రాంచ్‌లలో చెవి క్లినిక్‌లను ఏర్పాటుచేసి ఉచిత పరీక్షలను నిర్వహిస్తున్నారు. మొబైల్ హియరింగ్ క్లినిక్ పేరిట ఉచిత వినికిడి పరీక్షలను నగరంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో, వృద్ధాశ్రమాలు, ప్రభుత్వ పాఠశాలలు, బస్తీల్లో విరివిగా నిర్వహిస్తోంది. వారికిఅవసరమైన మందులను అందిస్తూ ఉచితంగా వినికిడి యంత్రాలను సైతం అందిస్తున్నారు. వినికిడి లోపాన్ని దరిచేరనివ్వకుండా చేయడమే తమ లక్ష్యమని డీపీకే బాబు చెబుతున్నారు. బధిర విద్యార్థులకుఉచిత యానిమేషన్ శిక్షణ పదవ తరగతి దాకా చదువుకొని ఏమి చేయాలో అర్ధం కాక ఉన్న బధిరులను చేరదీసి వారికి ఉచితంగా యానిమేషన్లో శిక్షణ ఇస్తున్నారు. అనంతరం ఉపాధి కూడా కల్పిస్తున్నారు. ఇప్పటికే వందలాది మంది బధిరులు శిక్షణ తీసుకుని యానిమేషన్న్ సంస్థల్లో సెలెక్ట్ అయి ఉద్యోగాలు చేస్తున్నారు. కరాటే, కంప్యూటర్, సాంస్కృతికం చిన్నారులకు కేవలం విద్యాబుద్ధులు నేర్పించడమే కాకుండా వారిలో మానసిక స్థైర్యాన్ని పెంపొందేలా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్, అడ్వెంచర్స్పైన శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా కంప్యూటర్, యానిమేషన్, మల్టీమీడియాపై అవగాహన కల్పిస్తూ కంప్యూటర్‌పై ఆసక్తి పెంచే విధంగా ప్రోత్సహిస్తున్నారు. పిల్లలకు పలు సాంస్కృతిక పోటీలు ఏర్పాటు చేయిస్తూ వారిలో మనో ధైర్యాన్ని నింపుతున్నారు. అంతే కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి హాస్టల్ వసతి కూడా కల్పిస్తున్నారు. పదవ తరగతి పరీక్షల్లో నూటికి నూరు శాతం ఉర్తీర్ణత సాధించడం ఇక్కడ విశేషం. అంతేకాకుండా మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో జాతీయ స్థాయిలో పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎన్నో పతకాలు సాధించారు. బధిరులైనా ఏ రంగంలోనైనా మాకు మేమే సాటి అని నిరూపిస్తున్నారు. పుట్టిన చిన్నారులకు వినికిడి పరీక్షలు పుట్టిన వెంటనే నెలల చిన్నారులకు వినికిడి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉచితంగా బేరా టెస్ట్, ఆడియోలాజికల్ ఎవాల్యుయేషన్ టెస్ట్‌లను చేస్తున్నారు. చిన్నారులకు 90 శాతం వినికిడి లోపిస్తే కాంక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీని సైతం ఉచితంగా నిర్వహిస్తున్నారు. సుమారు రూ.12 లక్షలు ఖర్చయ్యే ఈ సర్జరీని సైతం దాతల సహాయంతో విజయవంతంగా చేస్తున్నారు. వినికిడి సమస్యే ఉండొద్దు.. బధిర విద్యార్థుల అభ్యన్నతితోపాటు ప్రతి తల్లి అమ్మ అని పిలిపించుకునే భాగ్యానికి నోచుకోవాలనేదే మా ధ్యేయం. ఆశ్రయ్–ఆకృతి సంస్థలో శిక్షణ పొందుతున్న చిన్నారులకు అంతా ఉచితమే. ఎంఎన్సీ కంపెనీల సోషల్ రెస్పాన్సిబిలిటీ, దాతల సహాయంతో సంస్థను విజయవంతంగా నడుపుతున్నాం. చెవిటి సమస్య అనేదే లేకుండా చేయాలని మా క్లినిక్‌లను విస్తృతం చేశాం. బధిర విద్యార్థులు సాధారణ చిన్నారులతో కలిసి మాట్లాడేలా తీర్చిదిద్దేలా టీచర్లు తమవంతు కృషి చేస్తున్నారు. వినికిడి లోపం లేకుండా చేయడం, అవగాహన తీసుకురావడమే మా లక్ష్యం.– డీపీకే బాబు, ఆశ్రయ్–ఆకృతి, డైరెక్టర్ -
అమ్మ... గురు-బ్రహ్మ
బొమ్మను చేసి, ప్రాణం పోస్తే చాలు. బ్రహ్మ బాధ్యత తీరిపోతుంది. అమ్మ ప్రేమబంధం అలా తీరేది కాదు. కన్నపేగులా తెగిపోయేదీ కాదు. నవమాసాల బరువును మళ్లీ చేతుల్లోకి ఎత్తుకుంటుంది. బిడ్డ నీడను కూడా మోసుకు తిరుగుతుంది. కొన్నిసార్లు బ్రహ్మదేవుడు అన్నీ చెక్ చేసుకోకుండా డెలివరీ ఇచ్చేస్తాడు! అప్పుడు అమ్మే బ్రహ్మ అవుతుంది. బిడ్డను ‘కంప్లీట్’ గా తీర్చిదిద్దుతుంది. అలాంటి అమ్మలతో నడుస్తున్న బధిరుల పాఠశాలే... ఈవారం మన ‘ప్రజాంశం’. అన్నీ బాగున్న పిల్లలక్కూడా అమ్మ ఎప్పుడూ పక్కనే ఉండాలి. అలాంటిది పుట్టుకతోనే వినికిడి శక్తి లేక మాటకు దూరమైన చిన్నారులకు అమ్మ ఇంకెంత తోడుగా ఉండాలి?! మళ్లీ కడుపున పెట్టుకున్నంతగా! ఇక్కడ అమ్మలతో కలిసి ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తుంటే దేవుడు పెట్టిన లోపాన్ని సవరించే శక్తి అమ్మకు మాత్రమే ఉంటుందనిపిస్తుంది. అవును... తమ కడుపునకాసిన కాయకు తొడిమగా తోడుంటున్న ఈ తల్లులు తమ బిడ్డల కోసం పాఠాలు చెప్పే గురువులుగా కూడా మారి వారికి కొత్త జన్మ ఇస్తున్నారు. అదేమిటో చూద్దాం! హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉన్న ‘ఆశ్రయ ఆకృతి’ పాఠశాలలోని బధిర పిల్లల సక్సెస్ స్టోరీల గురించి చాలామందికి తెలుసు. అయితే వారి విజయాల వెనకున్న అమ్మల గురించి తెలుసుకున్నప్పుడు కళ్లు చెమరుస్తాయి. అమ్మల్ని గురువులుగా మార్చిన ఆ సొసైటీ నిర్వాహకుల గురించి వింటున్నప్పుడు చెవులు ఇంత అవుతాయి! ఆ బాధ తెలుసు... ‘ఆశ్రయ ఆకృతి’ పాఠశాల నెలకొల్పి పదిహేడేళ్లు కావస్తోంది. ప్రస్తుతం ఈ పాఠశాలలో 270 మంది విద్యార్థులున్నారు. వీరిలో కాశ్మీర్, బీహార్, జార్ఖండ్ నుంచి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. ‘‘మా తమ్ముడు కుళయప్ప పుట్టుకతోనే మూగవాడు. అయినా కూడా మా అమ్మానాన్నలు ఎంతో పట్టుదలతో వాడిని బధిరుల పాఠశాలలో చేర్పించి చదువు చెప్పించారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వాడి బాధలు చూశాను. దాంతో నా చదువు పూర్తవగానే హైదరాబాద్‌లోని ఓ బధిరుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాను. అక్కడ కొంత అనుభవం గడించాక 1996లో ‘ఆశ్రయ ఆకృతి’ పాఠశాల నెలకొల్పాను. ఐదుగురు పిల్లలకు పాఠాలు చెప్పడంతో మొదలుపెట్టాను. ప్రస్తుతం మా పాఠశాలకు మూడు బ్రాంచ్‌లున్నాయి. మూడువందలమంది విద్యార్థులున్నారు. యాభైమంది టీచర్లున్నారు. వీరిలో చాలామంది ఆ పిల్లల తల్లులే కావడం మా పాఠశాల ప్రత్యేకత’’ అంటూ పరిచయం చేసుకున్నారు ఆ పాఠశాల వ్యవస్థాపకులు డి.పి.కె బాబు. తల్లితండ్రుల ఆర్థికస్తోమతని బట్టి ఫీజుల్ని నిర్ణయించే ఈ పాఠశాల యాజమాన్యం... రెండేళ్ల క్రితం చార్మినార్ ప్రాంతంలో నెలకొల్పిన బ్రాంచ్‌లో డెబ్భైమంది విద్యార్థులను ఉచితంగా చేర్పించుకున్నారు. బిడ్డల కోసం... పుట్టిన బిడ్డ కొంచెం బరువు తక్కువుంటేనే బెంబేలెత్తిపోయే తల్లి... తన బిడ్డకు వినికిడి శక్తి లేదని తెలిస్తే ఎంతగా తల్లడిల్లుతుందో ఊహించగలం. బతికినంతకాలం తన బిడ్డ మరొకరికి భారం కాకుండా ఉండడానికి ఏం చెయ్యడానికైనా సిద్ధపడే తల్లుల్ని చేరదీసింది ఆశ్రయ ఆకృతి. ఇక్కడే తన కొడుకుని చదివిస్తూ... బిడ్డకోసం స్పెషల్ ఎడ్యుకేషన్‌లో ఎమ్‌ఎడ్ చేసి మరీ, ఇక్కడ పాఠాలు బోధిస్తున్న శశికళతో మాట్లాడితే మాతృత్వం వెనకున్న శక్తి గురించి అర్థమవుతుంది. ‘‘మా బిడ్డ బధిరుడు అని తెలియగానే ఈ స్కూల్లో చేర్పించాను. స్కూల్లో ఉన్న వసతులు, ఉపాధ్యాయుల సంఖ్య చూసి నా బిడ్డకు నాతో పనిలేదు... వాళ్లే అన్నీ నేర్పించేస్తారనుకున్నాను. అయితే, ఇక్కడ పిల్లలకు చెప్పిన విషయాల్ని ఇంటికెళ్లాక కూడా ప్రాక్టీస్ చేయించాలన్నారు. దానికోసం నేను కూడా బాబుతో ఉండాలన్నారు. మొదట్లో నాకు అర్థం కాలేదు... తర్వాత తెలిసింది. టీచర్స్‌తో పాటు నేను కూడా వాడికి చెప్పిన విషయాల్నే చెబుతూ పునశ్చరణ చేయిస్తూ ఉండాలని. అప్పటికి నేను డిగ్రీ చదువుకున్నాను. నేను బాబుకి బోధించే తీరుని చూసి స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బీఎడ్, ఎమ్‌ఎడ్ చేస్తే బాగుంటుందని, ఆ తర్వాత ఇక్కడే జాబ్ ఇస్తామని సార్ చెప్పడంతో నేను ఎమ్‌ఎడ్ పూర్తిచేశాను. చెప్పినట్లుగానే ఇక్కడే జాబ్ ఇచ్చారు. నా బిడ్డకే కాకుండా వాడిలాంటి మరికొందరికి పాఠాలు చెప్పే అవకాశం వచ్చింది’’ అని చెప్పారు శశికళ. ఈమెలాంటి తల్లులు ఇంకో పదిమంది ఉన్నారు. అన్ని శాఖల్లో... అందరి పిల్లల తల్లులు టీచర్లే కాలేరు కదా... ఎనిమిదో తరగతి చదువుతున్న అరుణ్‌కుమార్ తల్లి సునీత ఆయాగా పనిచేస్తోంది. అలాగే ఏడోతరగతి చదువుతున్న కార్తిక్ తల్లి మాధవి స్కూల్ అడ్మినిస్ట్రేన్ సెక్షన్లో పనిచేస్తున్నారు. శ్రీమేథా కాలేజీలో ఇంటర్ చదువుతున్న శామిత తల్లి కల్పన కూడా ఇక్కడ టీచర్‌గా పనిచేస్తున్నారు. ‘‘మా అమ్మాయి శామిత ఇక్కడ పదో తరగతి వరకు చదివి ఇప్పుడు మామూలు పిల్లలతో కలిసి ఇంటర్ చదువుతోంది. ఆమెతోపాటు గాయత్రి అనే అమ్మాయి కూడా అక్కడే ఇంటర్ చదువుతోంది. ఇద్దరూ ఫస్ట్‌క్లాస్ మార్కులతో ముందుకెళుతున్నారు. కంప్యూటర్లో కూడా ఫస్టే. ఎందుకంటే మా ఆశ్రయ ఆకృతిలో కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లలోనే పిల్లలు ఎక్కువ గడుపుతారు. వారికుండే జ్ఞాపకశక్తి వృథా కాకుండా వారి దృష్టిని ఎక్కువగా కంప్యూటర్ పైనే పెడుతున్నాం. బధిరబిడ్డలు సాధించిన చిన్నిచిన్న విజయాలు కూడా మమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తాయి. మా అమ్మాయి పదోతరగతి పాసైనపుడు నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది’’ అంటూ కల్పన తన కూతురి గురించి గర్వంగా చెప్పారు. అదే నా విజయరహస్యం... మొక్కుబడిగా చెప్పే పాఠాలకు, తల్లి చెప్పే పాఠాలకు చాలా తేడా ఉంటుంది. తన పాఠశాల విజయానికి అదే కారణమంటారు డి.పి.కె బాబు. ‘‘ఈ పాఠశాలలో చదువుకున్న ఓ ఏడుగురు విద్యార్థులు ప్రస్తుతం ఇంజనీరింగ్ చేస్తున్నారు. మరో ఇద్దరు పాలిటెక్నిక్, ఓ పదిమంది ఇంటర్ చదువుతున్నారు. అమృతరత్న, మాధవి, ప్రీతి అని మరో ముగ్గురు ప్రముఖ గ్రాఫిక్ కంపెనీలో ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. రెసిడెన్షియల్ పాఠశాలతో పాటు ఈ పిల్లల భవిష్యత్తు కోసం ఈ మధ్యనే ‘మల్టీమీడియా అండ్ యానిమేషన్ ట్రైనింగ్ సెంటర్’ ని కూడా నెలకొల్పాం’’ అని చెప్పారు బాబు. భవిష్యత్తులో ఇ-లెర్నింగ్... స్పీచ్ థెరపీ, లిప్ రీడింగ్ వంటివాటికి తోడు భవిష్యత్తులో ఇ-లెర్నింగ్ కంటెంట్‌ని పరిచయం చేయాలనుకుంటున్నారు ఈ పాఠశాల వ్యవస్థాపకులు. క్లాస్‌రూమ్‌లో టీచర్ చెప్పే పాఠాలు అందరికీ వినిపించవు. మిషన్లు పెట్టుకున్నా చాలా తక్కువమంది మాత్రమే పాఠాలు అర్థం చేసుకుంటారు. ఈ ఇబ్బంది నుంచి బయటపడడానికి ఇ-లెర్నింగ్ చాలా సాయపడుతుందంటారు బాబు. ‘‘ప్రొజెక్టర్ (స్క్రీన్) ద్వారా గోడపై అక్షరాలు, దానికి సంబంధించిన బొమ్మలు కనిపిస్తాయి. ఆ పక్కనే బాక్సులో టీచర్ సైగలతో చెబుతుంటారన్నమాట. దీనివల్ల పిల్లలు పాఠం చక్కగా చదువుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కొన్ని పాఠాలను చిత్రీకరించి సీడీలు తయారుచేశాం. త్వరలో ఒక వెబ్ బేస్డ్ అప్లికేషన్ తయారుచేస్తాం. ఇవి రెండూ మార్కెట్లోకి వస్తే ప్రభుత్వపాఠశాలలో చదువుకుంటున్న బధిర విద్యార్థులకు కూడా ఉపయోగం ఉంటుంది’’ అని ముగించారాయన. తన తమ్ముడి లాంటి ఎందరో పిల్లలకు బంగారు భవిష్యత్తునివ్వడానికి నడుం బిగించిన ఈ ఉపాధ్యాయుడికి ఆ స్కూలు విద్యార్థులు విజయకెరటాలయ్యారు. ఆ కెరటాల ధ్వనులు బధిరుల చెవుల్లోనే కాదు, మన చెవుల్లో కూడా మారుమోగేలా చేసిన వారందరికీ అభినందనలు చెప్పితీరాల్సిందే. - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి భారం కాదు... వరం మామూలు పిల్లలతో పోలిస్తే బధిరులకు విపరీతమైన జ్ఞాపకశక్తి ఉంటుంది. మా కంప్యూటర్ ల్యాబ్‌లో వారు చేసే అద్భుతాలు చూసి నాకు ఆశ్చర్యం వేసింది. వారిలో ఉన్న ఈ ప్రత్యేకమైన శక్తికి పనిచెబితే వారి భవిష్యత్తుకి అదే ఆధారమవుతుందనే ఉద్దేశ్యంతో ఈ సెంటర్‌ని నెలకొల్పాను. అక్కడ శిక్షణ తీసుకున్న ఓ ముగ్గురు అమ్మాయిలకు డ్రీమ్ అనే గ్రాఫిక్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మా విద్యార్థులతో పెద్దగా ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండదు. వారికి అర్థమయ్యేలా చెప్పలేకపోతే ఒక పేపర్‌పై మీకు కావలసిన వర్క్ డీటెయిల్స్ ఇచ్చేస్తే నిమిషాల్లో చేసి మీ ముందుంచుతారు. కాకపోతే మా వాళ్లని వారు అర్థం చేసుకునేవరకూ మా సెంటర్ నుంచి ఒక ఉద్యోగి వెళ్లి ఓ పదిరోజులు తోడుగా ఉంటారు. మొన్నీమధ్యే ఆ కంపెనీవారు నాతో మా పిల్లల గురించి గొప్పగా చెప్పారు. అనవసరంగా సమయం వృధా చేయరు, కొద్దిపాటి అనుభవం వచ్చిందని చెప్పాపెట్టకుండా మరో కంపెనీకి వెళ్లిపోరు. కొత్తప్రయోగాలు చేస్తారు... అంటూ పొగుడుతుంటే బధిరులు భారం కాదు వరం అనిపించింది. - డి.పి.కె బాబు వ్యవస్థాపకులు, ఆశ్రయఆకృతి పాఠశాల