ఏమి'టీ' దుస్థితి?
పదహారేళ్ల సోమిలి తంతి... టీ గార్డెన్లో బతుకు వెళ్లదీసే కన్నా ఢిల్లీలాంటి నగరంలో మంచి ఉద్యోగం వస్తే కుటుంబ కష్టాలు గట్టెక్కుతాయని ఆశపడింది. వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుపోయింది. గ్రహించేలోపే మోసగాళ్లు రొంపిలోకి దింపేశారు. కలలు ఛిద్రమై, చిక్కిశల్యమైన సోమిలి అదృష్టవశాత్తు కొంతమంది స్థానికుల సహాయంతో మురికి కూపం నుంచి బయటపడింది. సోమిలి జీవితం కొంతవరకు నయం.. కనీసం ఆ మాత్రం అదృష్టం లేని సోమిలీలు ఎందరో.. అస్సాం టీ తోటల్లోంచి మహానగరాల ఉక్కుపాదాల కింద నలిగిపోతున్న బాలికలు, మహిళలు ఎందరో... అందుకు కారణాలు ఎన్నో...
అసోం యువతుల జీవితాలను నిరక్షరాస్యత నిలువునా ముంచేస్తోంది. మద్యపానం, గృహహింస వారి పాలిట శాపమైంది. ఆర్థిక వెనుకబాటుతనమే అక్కడ ట్రాఫికర్లకు అదనుగా మారింది. అసోం టీ గార్డెన్లలో పనిచేసే మహళల సమస్యలపై ఇటీవల జరిపిన కొన్ని అధ్యయనాలు వారి దయనీయ పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి. ట్రాఫికర్ల కన్ను ఇప్పుడు అసోం టీ గార్డెన్లలో పనిచేసే యువతులపై పడింది. వారిని నమ్మించి ఉచ్చులో దింపుతున్నారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ యువతుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. బాలికలు అక్రమ రవాణాలో పావులవుతున్నారు. బానిసత్వ కార్మికులుగా మిగిలిపోతున్నారు. అంతేకాదు వారిపై ట్రాఫికర్లు శారీరక హింసలకు పాల్పడుతూ, బలవంతపు పెళ్లిళ్లకు కూడా వారిని బలి చేస్తున్నారు.
అసోం టీ గార్డెన్లలో పనిచేసే మహిళల్లో ఎక్కువ ఆదివాసీ, గిరిజనులే ఉంటారు. బ్రిటిష్ కాలం నుంచే వీరు టీ ఎస్టేట్లలో పనిచేస్తున్నారు. ఇక్కడ పని చేసేవారిలో ఎక్కువగా ఒడిశా, బీహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలనుంచీ వచ్చినవారే. టీ పరిశ్రమ అభివృద్ధి చెందినా అక్కడి కూలీల బతుకుల్లో మాత్రం మార్పు లేదు.
ఇటీవల ఢిల్లీలో వెలుగుచూసిన 16 ఏళ్ల సోమిలి తంతి కథ ఇందుకు ఓ ఉదాహరణ. నగరాల్లో ఆఫీసులో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి, అక్రమ రవాణాకు పాల్పడ్డ కిడ్నాపర్ల మోసాన్ని ఆమె గ్రహించలేకపోయింది. మహానగరంలో జీవితాన్ని ఊహించుకొని కలలు కంది. చివరికి కిడ్నాపర్ల ఉచ్చులో చిక్కుకుపోయింది. లైంగిక వేధింపులకూ గురైంది. ఎలాగో స్థానికుల సహాయంతో బయటపడింది. క్లాసులోనూ ఎప్పుడూ ముందుండే సోమిలి మంచి ఉద్యోగం పొంది ఆనందంగా ఉంటుందని అనుకుంటే.. ఆమె కాస్తా ట్రాఫికర్ల ఉచ్చులో చిక్కుకుపోయింది.
సోమిలి ఒక్కర్తే కాదు.. ఇలా అసోం నుంచి వెళ్లి ఇళ్లలో పనిచేసేవారు బానిసత్వపు సంకెళ్లలో చిక్కుకుంటున్నారు. లైంగిక వేధింపులకు గురవుతున్నారు. బీబీఏ లెక్కల ప్రకారం 2013-2015 మధ్య 200 మందికి పైగా పైగా బాలికలు అక్రమ రవాణాకు గురైనట్లు అసోంలోని కేవలం ఒక్క పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులను బట్టి చూస్తే తెలుస్తోంది. వీరంతా అక్కడి టీ ఎస్టేట్లలో పనిచేసే వారే. కొందరు కనీసం కేసులు కూడ నమోదు చేయని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.
ట్రాఫికింగ్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ పేరిట యునిసెఫ్, అసోం ప్రభుత్వం ఓ పరిశోధన చేశారు. అక్రమ రవాణాకు గురవుతున్న కార్మికుల ఇబ్బందులపై లెక్కలు తీశారు. కొన్ని ప్రైవేటు సంస్థలు, సంఘాల ఆధ్వర్యంలో ప్రజలు, టీ ఎస్టేట్లలోని కార్మికులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. యువతులను ఇతర నగరాలకు పంపించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరిస్తున్నారు. వీరేకాదు ట్రాఫికర్ల బారి నుంచి తప్పించుకొని బయట పడ్డవారు కూడా మిగిలిన వారికి అవగాహన కల్పించడంతో పాటు, తమ జీవితాలను తిరిగి నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.