స్కాం చేసి.. గర్ల్‌ఫ్రెండుకు 2.5 కోట్ల కారు గిఫ్ట్
ఎక్కడో మహారాష్ట్రలోని థానె ప్రాంతంలో ఉండి.. అమెరికాలో పన్ను ఎగ్గొట్టేవాళ్ల నుంచి 500 కోట్ల రూపాయలు నొక్కేసిన సాగర్ ఠక్కర్ అలియాస్ షాగీ (23) ఆ డబ్బుతో మంచి విలాసవంతమైన జీవితం ఆస్వాదించాడు. తన గర్ల్‌ఫ్రెండుకు రూ. 2.5 కోట్లు పెట్టి ఆడి ఆర్8 కారు పుట్టినరోజు బహుమతిగా కొనిచ్చాడు. ఈ విషయాన్ని థానె పోలీసులు తెలిపారు. షాగీ దగ్గర కూడా లెక్కలేనన్ని హై ఎండ్ కార్లు ఉన్నాయి. ఆడి ఆర్8 కారును అహ్మదాబాద్‌లో కొన్న తొలి వ్యక్తి ఇతడే. అయితే, అసలు ఇంత ఖరీదైన బహుమతి అందుకున్న అతడి గర్ల్ ఫ్రెండు ఎవరన్నది మాత్రం ఇంకా ఎవరికీ తెలియలేదు. ఆమె ఆనుపానులు కనిపెట్టి, కారును కూడా స్వాధీనం చేసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
షాగీ స్కూలు స్నేహితులలో కొందరిని అరెస్టు చేసి విచారించినప్పుడు ఈ విషయం తెలిసింది. ఈ బహుమతి గురించి షాగీ తరచు తమతో చెప్పేవాడని అంటున్నారు. థానె నుంచి అహ్మదాబాద్ వెళ్లిన తర్వాత సాగర్ ఠక్కర్ తన సోదరి రీమా ఠక్కర్తో కలిసి ఉండేవాడు. అమెరికాలో ఈ స్కాంకు మరో సూత్రధారి ఉన్నాడని.. అతడితో స్నేహం మొదలైన తర్వాతే స్కాం మొత్తం మొదలైందని పోలీసులు చెప్పారు. అమెరికాలో పన్ను ఎగ్గొట్టేవాళ్లకు సంబంధించిన వివరాలు తీసుకుని.. వాటిని సాగర్‌కు పంపేవాడు. వాటి ఆధారంగా ఇక్కడినుంచి అమెరికన్ పౌరులకు ఫోన్లు చేసి, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకునేవారు. సాగర్‌కు దుబాయ్‌లో కూడా భారీ ఎత్తున వ్యాపారం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ దండుకున్న డబ్బులతోనే ఆ వ్యాపారం పెట్టాడంటున్నారు.
థానెకు ఎఫ్‌బీఐ అధికారులు
అమెరికా పౌరులే లక్ష్యంగా జరిగిన ఈ దోపిడీ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఎఫ్‌బీఐ నుంచి ఏడుగురు అధికారులు వస్తున్నారు. థానె పోలీసు కమిషనరేట్ వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని సీపీ పరమ్‌వీర్ సింగ్ చెప్పారు. అహ్మదబాద్ నుంచి ముంబైకి మనీలాండరింగ్ చేస్తున్న నలుగురు హవాలా ఆపరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లను ఈ కేసులో సాక్షులుగా చేస్తామంటున్నారు. అమెరికాకు, అహ్మదాబాద్‌కు మధ్య ఎలాంటి లింకు ఉందో తేలుస్తామని చెబుతున్నారు.