ప్రభుత్వాసుపత్రుల్లో యోగా టీచర్లు
* పీహెచ్సీ నుంచి బోధనాసుపత్రుల వరకూ నియామకాలు
* కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ యోచన.. త్వరలోనే మార్గదర్శకాలు
* 2 రాష్ట్రాల్లో 2,000 మంది టీచర్లు అవసరం
సాక్షి, హైదరాబాద్: అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో యోగా గురువులను నియమించాలని కేంద్ర ఆరోగ్యశాఖ భావిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో పడకల సామర్థ్యాన్ని బట్టి యోగా గురువులను నియమించేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా యోగా కోర్సులను ఏఏ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నాయి, వాటికి తగిన గుర్తింపు ఉందా లేదా వంటి వివరాలను కేంద్ర ఆయుష్ విభాగం సేకరిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో యోగా టీచర్ల నియామకాలపై త్వరలోనే అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, ఒక నిపుణుల కమిటీని నియమిస్తున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.
దీనికోసం ఢిల్లీలో ఓ ఆయుష్ వర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. అయితే యోగా టీచర్ల సౌలభ్యాన్ని బట్టి నియామకాలు దశల వారీగా చేపట్టాలని ఆయుష్ విభాగం భావిస్తోంది. పడకల సామర్థ్యాన్ని బట్టి యోగా టీచర్లను నియమించాలా లేదా ఔట్ పేషెంట్ రోగుల సామర్థ్యాన్ని బట్టి నియామకాలు చేయాలా అన్నది నిర్ణయించాలి. కాగా, తెలంగాణ, ఏపీలలో 1,700కి పైగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 300కి పైగా సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 60 ఏరియా ఆస్పత్రులు, 18 బోధనాసుపత్రులు ఉన్నాయి. సుమారు 2వేల మందికిపైగా యోగా టీచర్లు అవసరమవుతారు. దీనిపై త్వరలోనే కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయనుంది.