Below 7
-
ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై : బ్యాంకింగ్, ఐటీ, రియాల్టీ, ఆటో స్టాక్స్ లో కొనసాగుతున్న నష్టాలతో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ ఒడిదుడుకులకు లోనవుతోంది. అదేవిధంగా మార్నింగ్ ట్రేడ్ లో 100 పాయింట్ల రేజ్ అయిన బీఎస్ఈ సెన్సెక్స్ సైతం 63.94 పాయింట్లు నష్టపోతోంది. సెన్సెక్స్ 25,426 వద్ద, నిఫ్టీ 7,796 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకు ఆఫ్ బరోడా నాలుగో త్రైమాసికంలో రూ.3,230 కోట్ల నష్టాలను నమోదుచేస్తూ శుక్రవారం ఫలితాలను విడుదలచేయడంతో, నేటి ట్రేడింగ్ 7శాతం మేర ఆ బ్యాంకు షేర్లు పతనమవుతున్నాయి. మార్కెట్ విశ్లేషకులు అంచనావేసిన కంటే దారుణంగా దీని లాభాలు పడిపోయాయి. బ్యాంకు ఆప్ బరోడాతో పాటు యూకో బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, దేనా బ్యాంకులు మొండి బకాయిల బెడదతో క్యూ4 ఫలితాల్లో నిరాశను చూపాయి. దీంతో నిఫ్టీ పీఎస్ యూ ఇండెక్స్ 3శాతం కిందకు జారింది. మరోవైపు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్, ఏషియన్ పేయింట్స్, బీహెచ్ఈఎల్, కోల్ ఇండియా లాభాల్లో నడుస్తుండగా.. ఎస్ బీఐ, భారతీ ఎయిర్ టెల్, హెచ్ యూఎల్, ఐసీఐసీఐ బ్యాంకు, గెయిల్ నష్టాలను నమోదుచేస్తున్నాయి. పసిడి, వెండి ధరలు నేటి మార్కెట్లో పుంజుకున్నాయి. పసిడి రూ.63 పెరిగి రూ.30,097గా నమోదవుతుండగా... వెండి రూ.392 పెరిగి రూ. 41,366గా ట్రేడ్ అవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 66.85గా ఉంది. -
గణాంకాల ప్రభావంతో నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై : శుక్రవారం నాటి స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 222.07 పాయింట్ల నష్టంతో 25,568 దగ్గర, నిఫ్టీ 64 పాయింట్ల నష్టంతో 7,850 దగ్గర ట్రేడవుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్ స్టాక్స్ లో అమ్మకాల పర్వం కొనసాగుతుండడంతో, మిగిలిన దేశీయ సూచీలు నష్టాల బాట పట్టాయి. ఐసీఐసీఐ బ్యాంకు షేర్లలో ఎక్కువగా అమ్మకాలు జరుగుతుండగా. ఐసీఐసీఐ 2శాతం, ఎస్ బీఐ 1శాతం మేర పడిపోతోంది. దీంతో నిఫ్టీ బ్యాంకు 1శాతం కిందకు జారింది. నిఫ్టీలో మేజర్ షేరుగా ఉన్న ఇన్ఫోసిస్ సైతం 1శాతం మేర పతనమైంది. స్థూల ఆర్థిక డేటా కూడా బలహీనంగా ఉండటంతో, జూన్ లో ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందనే ఆశలను మార్కెట్లు కోల్పోతున్నాయి. వినియోగదారుల ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆధారంగా వడ్డీరేట్లలో మార్పులకు రిజర్వ్ బ్యాంకు మొగ్గు చూపుతుంటుంది. అయితే ఈసారి ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ట స్థాయికి పెరగడంతో, తదుపరి వడ్డీ రేట్ల కోతకు అవకాశం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. పారిశ్రామికోత్పత్తి కూడా నత్తనడకనే సాగడం మార్కెట్లపై ప్రభావం చూపింది. టాటా మోటార్స్, విప్రో, బజాజ్ ఆటో, ఏషియన్ పేయింట్స్, హెచ్ యూఎల్ లాభాలను నమోదుచేస్తుండగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా స్టీల్, బీహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ లు నష్టాల్లో నడుస్తున్నాయి. మరోవైపు పసిడి, వెండి లాభాలను ఆర్జిస్తున్నాయి. బంగారం, వెండి రెండూ రూ.28 లాభంతో రూ.29,929, రూ.40,831 గా నమోదవుతున్నాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ 66.75గా ఉంది.