మెరుపుల రాణి!
‘టెల్ మీ సమ్‌థింగ్ ఐ డోన్ట్ నో’ ఆల్బమ్‌తో ఆబాలగోపాలాన్ని ఆకట్టుకుంది అమెరికన్ అమ్మాయి సెలినా గోమెజ్. మనల్ని చెప్పమంటుందిగానీ... ఈ అందాల అమ్మాయి నోటి నుంచి ఎన్నో కొత్త విషయాలు వినవచ్చు. అవి మనల్ని నవ్వించేవి కావచ్చు. స్ఫూర్తినిచ్చేవి కావచ్చు, స్నేహానికి సంబంధించిన విషయాలు కావచ్చు. ఏ విషయం గురించి చెప్పినా పాట పాడినంత తీయగా చెప్పడం ఆమె ప్రత్యేకత.
ఏడు సంవత్సరాల వయసు నుంచే తల్లి నటించిన చిత్రాలు చూసేది. ఆమె రిహార్సల్స్‌ను దగ్గరి నుంచి గమనించేది. తల్లితో పాటే థియేటర్లకు వెళ్లేది. ఇలా చిన్న వయసులోనే సెలినాలో ‘నటన’ పట్ల అభిమానం, ఆసక్తి పెరిగాయి. సెలినా నటించిన తొలి చిత్రం ‘బెర్ని అండ్ ఫ్రెండ్’. ఈ సినిమాలో నటించడానికి పద్నాలుగు వందల మంది పిల్లలతో పోటీ పడి గెలిచింది.
‘‘ఈ సినిమాకు ముందు నటన మీద ప్రేమ తప్ప ఎలా నటించాలనేది పెద్దగా తెలియదు. ఈ సినిమా నాకు అన్నీ నేర్పింది’’ అంటుంది సెలిన.
డైలాగులు కంఠతా పట్టడం మిగిలిన వాళ్లకు కష్టమేమోగానీ సెలినాకు మాత్రం మంచి నీళ్లు తాగినంత సులువు. తన డైలాగులను ఒక్కసారి చూస్తే వంద సార్లు చూసినట్లే. ఠకీమని చెప్పేస్తుంది. ‘‘నీ టెక్నిక్ మాకు కూడా నేర్పవూ’’ అని చాలామంది నటులు సెలినాను అడుగుతుంటారు!
సెలినా నటి, గాయని మాత్రమే కాదు...పెయింటర్ కూడా. ఏమాత్రం తీరిక దొరికినా చక్కగా బొమ్మలు వేస్తుంది. భౌతికశాస్త్రం అంటే ఇష్టం. పర్యావరణ సమస్యల గురించి చక్కగా మాట్లాడగదు.
‘‘పర్యావరణ పరిరక్షణకు నా వంతుగా పని చేస్తాను’’ అంటోంది. తాను చేయాల్సిన మిగిలిన పనుల కంటే ఈ పనే ముఖ్యం అని కూడా అంటుంది సెలినా.