విధేయతకు ఇంతకన్నా నిదర్శనం లేదేమో!
కుక్కలు గురించి మనం అప్పుడప్పుడు చులకనగా మాట్లాడుతాం కానీ.. అవి మనుషులపై అవ్యాజమైన ప్రేమను చూపుతాయి. అంతులేని స్నేహాన్ని పంచుతాయి. మనుషులకు బెస్ట్ ఫ్రెండ్స్‌గా మసులుకుంటాయి. మరెవరికీ సాటిలేని విధేయతను చూపుతాయి. ఈ విషయాన్ని మరోసారి ఈ బుజ్జీ కుక్క నిరూపించింది. తన యాజమాని తనను వదిలిపెట్టిన ప్రదేశంలోనే కోసం ఏడు నెలలపాటు వేచిచూసి.. ఎట్టకేలకు అతన్ని కలుసుకోగలిగింది. ఈ ఘటన దక్షిణ థాయ్‌లాండ్‌లో గతవారం జరిగింది.
ఖువాన్ థాంగ్ గ్రామంలో రోడ్డుపక్కన 'బిగ్ బ్లూ' అనే మాంగ్రెల్ జాతి కుక్క దాదాపు ఏడు నెలలుగా వేచి చూస్తు గడిపింది. 'బిగ్ బ్లూ' యాజమాని ఓ పండ్ల వ్యాపారి. అతడు కారులో పండ్లు సరఫరా చేస్తుంటాడు. ఓసారి ఒకటికి వెళ్లాల్సి వచ్చి అతను ఖువాన్ థాంగ్ గ్రామ సమీపంలో వాహనాన్ని నిలిపాడు. దీంతో కుక్క కూడా కారు నుంచి దూకింది. కుక్క దిగిన విషయాన్ని గుర్తించకుండానే అతను కారును నడిపించుకుంటూ వెళ్లిపోయాడు. ఆ తర్వాత 'బిగ్ బ్లూ' అక్కడే రోడ్డుపక్కన తన యాజమాని కోసం వేచి చూస్తూ ఉండిపోయింది. అది తోక ఊపుకొంటూ అక్కడే తచ్చాడేది కానీ.. అక్కడి నుంచి కదిలేది కాదు. కొంతకాలంలోనే 'బిగ్ బ్లూ' స్థానికంగా పాపులర్ అయిపోయింది. స్థానికులు ఎప్పుడూ ఏదో ఆహారం తెచ్చి దానికి పెట్టేవారు.
మరోవైపు యజమాని కూడా తన కుక్క కోసం ఏడు నెలలుగా వెతుకుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో అతను పండ్ల వాహనంతో గతవారం ఖువాన్ థాంగ్ గ్రామానికి వచ్చాడు. అక్కడ రోడ్డు పక్కన తచ్చాడుతున్న 'బిగ్ బ్లూ' యాజమానిని చూడగానే తోక ఊపుకుంటూ అతని చుట్టూ ఆనందంతో గంతులు వేసింది. బుజ్జీ కుక్క ఏడు నెలల నిరీక్షణకు తెరపడటం స్థానికులకు ఆనందం కలిగించింది.