‘బ్రహ్మ కన్ను’ గురించి తెలుసా.. ఆ శాపం గురించి ఎప్పుడైనా విన్నారా?
కోహినూర్.. ప్రపంచంలోనే ఫేమస్ వజ్రం. బ్రిటన్ రాణి కిరీటంలో ఉన్న ఈ వజ్రం మనకు తిరిగిచ్చేయాలన్న డిమాండ్లు ఎప్పటికప్పుడు వస్తునే ఉంటాయి. ఆ మధ్య రాణి చనిపోయినప్పుడు కూడా ఇవి వెల్లువెత్తాయి. ఇదే తరహాలో మన దేశం నుంచి తరలిపోయిన మరో పెద్ద వజ్రం ‘బ్రహ్మ కన్ను (ఐ ఆఫ్ బ్రహ్మ)’ గురించి మీకు తెలుసా? అది ఇచ్చిన ‘శాపం’ గురించి మీరెప్పుడైనా విన్నారా? లేదా.. అయితే.. ఈ వివరాలు మీ కోసమే..
అది అరుదైన నలుపు రంగు వజ్రం. ‘ది బ్లాక్ ఓర్లోవ్ డైమండ్’గా పిలుస్తున్న దీని బరువు 67.69 క్యారెట్లు. ప్రపంచంలోని నలుపు రంగులోని అతిపెద్ద వజ్రాల్లో దీనిది ఏడో స్థానం. పాండిచ్చేరి (ప్రస్తుతం పుదుచ్చేరి)లోని ఉన్న ఓ ఆలయంలో ఉన్న బ్రహ్మ దేవుడి విగ్రహం నుదుటిపై ఈ వజ్రం ఉండేదట. అందుకే దీనిని ‘బ్రహ్మ కన్ను’గా పిలిచేవారు. ఆ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న ఓ సన్యాసి బ్రహ్మ దేవుడి విగ్రహం నుంచి ఈ వజ్రాన్ని పెకలించి, దొంగిలించుకెళ్లాడు. దీనితో ఈ వజ్రం ఎవరివద్ద ఉంటే వారికి కీడు జరిగేలా బ్రహ్మ దేవుడు శపించాడన్నది అప్పటి కథనం. ఈ క్రమంలోనే వజ్రాన్ని దొంగిలించిన సన్యాసి కొంతకాలానికే హత్యకు గురయ్యాడని.. క్రమంగా ఇది రష్యాకు చేరిందని చెబుతారు.
ముగ్గురి ఆత్మహత్యలతో..
భారతదేశం నుంచి రష్యాకు చేరిన ‘బ్రహ్మ కన్ను’ వజ్రం చేతులు మారుతూ యూరప్‌కు చేరుకుంది. 1932లో యూరోపియన్ వజ్రాల డీలర్ జేడబ్ల్యూ పారిస్ ఈ వజ్రాన్ని కొని అమెరికాకు తీసుకెళ్లాడు. కొద్దిరోజులకే ఓ పెద్ద భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత రష్యా నుంచి ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌కు వచ్చి తలదాచుకుంటున్న రష్యా రాజకుమార్తెలు లియోనిలా బరియటిన్స్కీ, నదియా వ్యేగిన్ ఓర్లోవ్ల చేతికి ఈ వజ్రం చేరింది. ఈ ఇద్దరూ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. వజ్రాన్ని చివరిగా ధరించిన రాజకుమార్తె పేరిటే దీనికి ‘బ్లాక్ ఓర్లోవ్’ అని పేరువచ్చింది. అది శాపగ్రస్తమైనదిగా ప్రచారమైంది.
శాపం పోతుందని ముక్కలు చేసి
1950వ దశకంలో చార్లెస్ విల్సన్ అనే వ్యక్తి ఈ వజ్రాన్ని కొనుగోలు చేశాడు. అసలైన ‘బ్రహ్మ కన్ను’ వజ్రం బరువు ఏకంగా 195 క్యారెట్లు. అయితే దీనికి ఉన్న శాపం పోతుందన్న ఉద్దేశంతో.. మూడు ముక్కలు చేయించాడు. అందులో పెద్ద ముక్క ఇప్పుడు ‘బ్లాక్ ఓర్లోవ్’ (67.69 క్యారెట్లు)గా చలామణీ అవుతోంది. మిగతా రెండు ముక్కలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు.
భయంతో ‘రేటు’ మారుతూ..
‘బ్లాక్ ఓర్లోవ్’ వజ్రం శాపగ్రస్తమైన దన్న ప్రచారంతో దాని విలువ పెరు గుతూ తగ్గుతూ వచ్చింది. విల్సన్ 1969లో ‘బ్లాక్ ఓర్లోవ్’ వజ్రాన్ని గుర్తు తెలియని వ్యక్తికి రూ.2.45 కోట్లకు అమ్మాడు. తర్వాత చాలాకాలం ఎవరి కంటా పడ లేదు. 1990లో ఈ వజ్రం సదబీజ్ సంస్థలో వేలానికి వచ్చినప్పుడు రూ.80 లక్షలే పలికింది. కానీ 1995లో జరిగిన వేలంలో ఏకంగా రూ.12.25 కోట్లకు అమ్ముడైంది. ఆ వ్యక్తి నుంచి 2004లో అమెరికన్ ధనవంతుడు డెన్నిస్ పెటిమెజాస్ ఈ వజ్రాన్ని కొన్నా ధర ఎంతో బయటికి రాలేదు. 2006లో ఆయన దీనిని రూ.2.9 కోట్లకు అమ్మే శాడు. ఇటీవలే ఈ వజ్రాన్ని న్యూయార్క్, లండన్లలో జరిగిన నేచురల్ హిస్టరీ ఎగ్జిబిషన్లలో ప్రదర్శించారు. అయితే, భారత్‌లో ఇప్పటి వరకూ నల్ల వజ్రాలు దొరకనందున.. ‘బ్లాక్ ఓర్లోవ్’వజ్రం ఇక్కడిది కాదనే వాదనా ఉంది. వజ్రాల వ్యాపారంలో ఉన్న వారు మాత్రం ఇది భారత్ నుంచే వచ్చిందని చెబుతున్నారు. ఆ శాపమూ వాస్తవమే అని అంటున్నారు.