నేను ప్రధాని కాదు.. గ్లామర్ మోడల్‌ను
లండన్: బ్రిటన్ కొత్త ప్రధానిగా కన్సర్వేటివ్ పార్టీ నాయకురాలు థెరిసా మే బుధవారం ప్రమాణం చేస్తారని ప్రస్తుత ప్రధాని డేవిడ్ కామెరూన్ ప్రకటించాక సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి. విస్తుపోయే విషయం ఏంటంటే చాలామంది నెటిజెన్లు అభినందనలు తెలిపింది బ్రిటన్ కాబోయే ప్రధాని థెరిసా మేకు కాదు.. అదే పేరుతో ఉన్న ఆ దేశ హాట్ మోడల్ థెరిసా మేకు.
తన ట్విట్టర్ ఖాతాలో అభినందన సందేశాలు చూసి మోడల్ థెరిసా మే ఆశ్చర్యపోయింది. ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్నందుకు శుభాకాంక్షలంటూ వచ్చిన ట్వీట్లు చూసి ఈ మోడల్ ముద్దుగుమ్మ విస్తుపోయింది. దీంతో మోడల్ థెరిసా మే స్పందిస్తూ.. 'మీరు నన్ను ఎవరనుకుంటున్నారో? నేను యూకే గ్లామర్ మోడల్, కాబోయే ప్రధాన మంత్రిని కాదు. చాలా మంది ఎందుకు పొరబడుతున్నారో! మీరు భావిస్తున్న వ్యక్తిని కాదు. దయచేసి అభినందలు ఆపండి' అంటూ ట్వీట్ చేసింది.
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలంటూ (బ్రెగ్జిట్) జూన్ 23న నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణలో తీర్పు వెలువడటంతో.. కామెరాన్ ప్రధాని పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ప్రస్తుత హోంమంత్రి థెరిసా (59) బాధ్యతలు చేపట్టనున్నారు.