తప్పిపోయి.. దొరికారు
రాజేంద్రనగర్ రంగారెడ్డి : రాఖీ కొనుగోలు చేసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన చిన్నారి అక్కా, తమ్ముళ్లు ఇంటి దారి మరిచారు. స్థానికుల సహాయంతో కస్తూర్బా ట్రస్ట్‌కు చేరారు. పిల్లలు తప్పిపోయిన విషయాన్ని స్థానికులు వాట్సప్‌లో షేర్ చేయడంతో అది కాస్తా శిశు విహార్ అధికారులకు తెలిసింది. పిల్లలను తీసుకువెళ్లేందుకు తల్లిదండ్రులు ట్రస్ట్‌కు రాగా నిబంధనల ప్రకారం అధికారులు అన్ని దస్తావేజులు పరిశీలించే క్రమంలో సమయం మించిపోయింది. దీంతో పిల్లలను శిశువిహార్‌కు తరలించారు. ఈ సంఘటన మంగళవారం హైదర్షాకోట్లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. గంధంగూడ ప్రాంతానికి చెందిన దినేష్, ఉష దంపతులు బతుకుదెరువు కోసం వలస వచ్చారు.
వీరికి నందిని, కృష్ణ ఇద్దరు పిల్లలు. మంగళవారం ఉదయం పక్కబస్తీ (మాధవీనగర్)లో ఉన్న కిరణాషాపుకు వెళ్లి రాఖీ కొనుగోలు చేస్తామని రూ.20 తీసుకొని పిల్లలిద్దరూ ఇంటి నుంచి బయల్దేరి వెళ్లారు. రాఖీ కొనుగోలు చేసి ఇంటికి వెళ్తూ దారి మరిచి అక్కడే తిరుగుతున్నారు. దీంతో దుకాణ యజమానితో పాటు స్థానికులు గమనించి వారిని పిలిచి వివరాలు సేకరించేందుకు ప్రయత్నించారు. కానీ సరైన ఇంటి దారి చూపకపోవడంతో హైదర్షాకోట్ పంచాయతీ కార్యాలయానికి పంపించారు.
పంచాయతీ సిబ్బంది వారిని పక్కనే ఉన్న కస్తూర్బా ట్రస్ట్‌లో అప్పగించారు. ఇదిలా ఉండగా పిల్లలు తప్పిపోయిన విషయాన్ని కొందరు తమ వాట్సప్‌ల్లో ఇతరులకు షేర్ చేశారు. ఇది శిశువిహార్ అధికారులకు చేరింది. అధికారులు వచ్చి పిల్లలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్పటికే పిల్లలను వెతుక్కుంటూ తల్లిదండ్రులు దినేష్, ఉషలు ట్రస్ట్ వద్దకు వచ్చారు. నియమనిబంధనల ప్రకారం పూర్తి వివరాలు ఆధారాలు తీసుకొని పరిశీలించే సరికి సాయంత్రం దాటింది. సమయం మించిపోవడంతో పిల్లలిద్దరిని బుధవారం ఉదయం అప్పగిస్తామని తెలిపి యూసూఫ్‌గూడలోని శిశువిహార్‌కు తరలించారు.
మిన్నంటిన పిల్లల రోదన
తమను వెతుక్కుంటూ వచ్చిన తల్లిదండ్రులను చూసి పిల్లలు బోరున విల్లపించారు. తల్లి సైతం తమ పిల్లలను తమకు అప్పగిస్తే ఏమవుతుందంటూ కాళ్లా, వెళ్లాపడి రోదించింది. ఇది చూసిన స్థానికులు వాట్సప్ కారణంగా ఇదంతా జరిగిందని వాపోయారు.