అవినీతిలో కూరుకుపోయాయి
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలపై బీఎస్పీ జాతీయ కార్యదర్శి విమర్శ
కర్నూలు, అనంతపురం జిల్లాల కార్యకర్తల సమావేశం
కర్నూలు సిటీ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతి ఊబిలో కురుకుపోయాయని బహుజన సమాజ్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వీర్ సింగ్ అరోపించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బహూజన సమాజ్ పార్టీ జిల్లా అద్యక్షుడు బి.ఎస్ నవీన్ అద్యక్షతన నిర్వహించిన కర్నూలు, అనంతపురం జిల్లాల కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో అగ్రవర్ణ కులాలకు చెందిన పార్టీలే రాజ్యాం ఏలుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాధికారం అనేది సామాన్యలకు దక్కడం లేదని, రాజ్యాంగం కల్పించిన హక్కులను సైతం రాజకీయ పార్టీల నాయకులు అణగదొక్కుతున్నారన్నారు.
బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు అబివృద్ధి ఫలాలు అందకుండా అడ్డుపడుతున్న పార్టీలకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే సత్తా ఓక్క బీఎస్పీకే ఉందన్నారు. బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రసాద్ ఉపాసక్ మాట్లాడుతూ అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావుఫూలే అలోచన విధానంతో ముందుకు పోతున్న ఏకైక పార్టీ బీఎస్పీ అనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. అనంతరం పార్టీ ఆఫీస్‌ను ప్రాంరంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రవి, నాయకులు మల్లెకల్, వనుములయ్య, ఓబులేష్, లక్ష్మీనారాయణ, రవీంద్రబాబు, బాలస్వామి, దాసు,వెంకటేష్, దేవదానం తదితరులు పాల్గొన్నారు.