పత్తి విత్తు... రైతు చిత్తు
ఎన్ని నిబంధనలు పెట్టినా విత్తన వ్యాపారుల ఆగడాలు ఆగడం లేదు. రైతును చిత్తు చేసి అందిన కాడికి దోచుకోవడమే లక్ష్యంగా వ్యాపారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇన్నాళ్లూ కొన్ని రకాల కంపెనీల విత్తనాలను వ్యూహాత్మకంగా కొరతగా చూపి ఎక్కువ ధరకు అమ్మే వ్యాపారులు తాజాగా కొత్త దందాకు తెరతీశారు. రూ.500 లభించే హైబ్రీడ్ పత్తి విత్తనాలను బీజీ-2 బీటీ విత్తనంగా చలామణి చేస్తూ రూ.930 విక్రయిస్తున్నారు.అంతేకాకుండా 125 గ్రాములు కందుల మిశ్రమంతో ఉండే బీజీ-2 విత్తన ప్యాకెట్‌ను రూ.862 విక్రయించాల్సి ఉండగా రూ.930 విక్రయిస్తూ దండుకుంటున్నారు. ఈ వ్యవహారం సాక్షాత్తూ వ్యవసాయశాఖ అధికారుల తనిఖీల్లోనే బుధవారం వెలుగుచూసింది.
గజ్వేల్: ఎన్ని నిబంధనలు పెట్టినా విత్తన వ్యాపారుల ఆగడాలు ఆగడం లేదు. రైతును చిత్తు చేసి అందిన కాడికి దోచుకోవడమే లక్ష్యంగా వ్యాపారులు ప్రణాళికలు రచిస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు ఒకటి రెండు రకాల బీటీ పత్తి విత్తనాలకు మాత్రమే వ్యూహాత్మకంగా డిమాండ్‌ను సృష్టించిన వ్యాపారులు ఒక్కో ప్యాకెట్‌పై మూడు రెట్ల ధరలను వసూలు చేశారు. అయితే ‘సాక్షి’ వరుస కథనాలు, వ్యవసాయశాఖ అధికారుల చర్యల ఫలితంగా ఈ ప్యాకెట్లను ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
దీన్ని జీర్ణించుకోలేని వ్యాపారులు జిల్లాలో సింహభాగం పత్తి సాగయ్యే గజ్వేల్ కేంద్రంగా మరో అక్రమానికి తెరలేపారు. రూ.500 లభించే హైబ్రీడ్ పత్తి విత్తనాలను బీజీ-2 బీటీ విత్తనంగా చలామణి చేస్తూ రూ.930 విక్రయిస్తున్నారు. అంతేకాకుండా 125 గ్రాములు కందుల మిశ్రమంతో ఉండే బీజీ-2 విత్తన ప్యాకెట్‌ను రూ.862 విక్రయించాల్సి ఉండగా రూ.930 విక్రయిస్తూ దండుకుంటున్నారు. ఈ వ్యవహారం సాక్షాత్తూ వ్యవసాయశాఖ అధికారుల తనిఖీల్లోనే బుధవారం వెలుగుచూసింది.
రెండేళ్ల క్రితం వరకు ప్రతి ఖరీఫ్ సీజన్లోనూ బీటీ పత్తి విత్తనాల బ్లాక్ మార్కెట్ రైతులకు తలనొప్పిగా మారింది. సాధారణంగా రూ.930 విక్రయించాల్సిన ప్యాకెట్ విత్తనాలను వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌కు తరలించి ఇష్టారీతిగా విక్రయించేవారు. ఒక్కో ప్యాకెట్‌ను రూ.3 వేలకుపైగా విక్రయించి లక్షలు దండుకున్నారు. శాస్త్రీయంగా అన్ని రకాల విత్తనాలు ఒకే రకమైన ఫలితాలనిస్తుండగా వ్యాపారులు మాత్రం వ్యుహాత్మంగా కొన్ని రకాలే మంచి దిగబగడులనిస్తాయని అపోహలు సృష్టించి దండుకున్నారు. ఈనేపథ్యంలో ఆత్మ(అగ్రికల్చర్ టెక్నాలజీ మెనేజ్మెంట్ ఏజెన్సీ), వ్యవసాయశాఖ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వివిధ రకాల విత్తనాలను వేసిన పత్తి క్షేత్రాలపై అధ్యయనానికి శ్రీకారం చుట్టింది.
ఇందులో భాగంగానే మెదక్ జిల్లాలో గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామంలో గతేడాది, ఈసారికూడా పలువురు రైతుల భూముల్లో నాలుగైదు రకాలకు చెందిన విత్తనాలను సాగు చేయించిన అన్నీ ఒకే రకమైన ఫలితాలనిస్తాయని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఈ ప్రయోగ ఫలితాలను కరపత్రాల ద్వారా అధికారులు రైతులకు వివరించారు. ఈ ప్రచారంలోనూ ‘సాక్షి’ తనదైన పాత్రను పోషించింది. ఎన్నోసార్లు ప్రత్యేక కథనాలను ప్రచురించి రైతుల ఆలోచనా విధానంలో మార్పునకు నాంది పలికింది. ఈ క్రమంలోనే ఈసారి జిల్లాలో 1.73 లక్షల హెక్టార్లకుపైగా పత్తి సాగయ్యే అవకాశముందని వ్యవసాయశాఖ అధికారులు భావిస్తున్నారు.
ఇందుకోసం 6 లక్షల విత్తనాల ప్యాకెట్లు అవసరమవుతాయని అంచనా వేసి 40కి పైగా వివిధ కంపెనీలకు అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా కూడా విత్తనాల కొరత లేదు. దీంతో విత్తనాలను ఎమ్మార్పీకే విక్రయించాల్సి రావడంతో విత్తన వ్యాపారులు మరో పథకం పన్నారు. అందులో భాగంగా జిల్లాలో పత్తి అధికంగా సాగయ్యే గజ్వేల్ కేంద్రంగా ఓ ప్రధాన కంపెనీకి చెందిన ప్యాకెట్లు అధిక దిగుబడులనిస్తాయనే అపోహను సృష్టించారు. ఆ కంపెనీ కి చెందిన ప్యాకెట్లు ఇవ్వడానికి టోకెన్ అమౌంట్ పేరిట రైతుల నుంచి రూ.100 నుంచి రూ.150 వసూలు చేశారు. ఇది పసిగట్టిన ‘సాక్షి’ ఈనెల ‘పక్కాగా బ్లాక్ దందా’ పేరిట మే 4న ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. ముందస్తు వసూళ్లను కట్టడి చేయగలిగింది.
ఇక కొత్త తరహా అక్రమం....
బీటీ పత్తి విత్తనాల ప్యాకెట్లను బ్లాక్ మార్కెట్ చేయడానికి అన్ని దారులు మూసుకుపోవడంతో వ్యాపారులు కొత్త తరహా అక్రమానికి తెరలేపారు. రూ.500 మాత్రమే విక్రయించాల్సిన హైబ్రీడ్ బీటీ విత్తన ప్యాకెట్‌ను బీజీ-2గా చలామణి చేస్తూ, 125 గ్రాముల కందుల మిశ్రమంతో ఉన్న బీజీ ప్యాకెట్‌ను రూ.862 విక్రయించాల్సి ఉండగా దాన్ని రూ.930 విక్రయిస్తున్నారు. బుధవారం వ్యవసాయశాఖ తనిఖీల్లో ఈ విషయం బయటపడటం, ఈ క్రమంలోనే అక్రమానికి పాల్పడిన వ్యాపారిపై కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది.
బీటీ పత్తి విత్తనాలు, ఎరువుల పంపిణీలో బ్లాక్ మార్కెట్‌ను సహించేదిలేదని ఈనెల 4న గజ్వేల్‌లో నిర్వహించిన సమీక్షలో సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ మేరకు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శరత్ ఈనెల 13న గజ్వేల్‌లో సమీక్ష నిర్వహించి వ్యాపారులకు హెచ్చరికలు చేశారు. అంతకు ముందు వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ హుక్యానాయక్తోపాటు పలువురు అధికారులు సైతం తనిఖీలు నిర్వహించి వారు కూడా హెచ్చరికలు చేశారు. అయినా వ్యాపారులు మాత్రం తమ తీరు మార్చుకోలేదు. రైతును చిత్తు చేయడమే లక్ష్యంగా హైబ్రీడ్ పత్తి విత్తనాలను బీజీ-2 పేరిట చలామణి చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు.