హలీం అంటే ఏంటో ఇక్కడే తెలిసింది
- స్వాతి
హైదరాబాద్: చిన్నప్పుడు సిగ్గులమొగ్గ.. కెమెరా ముందుకు రాగానే చిలిపిముగ్ధ అయింది. యాక్షన్ అనగానే మాటలతో మంత్రం వేసింది. బుల్లితెరపై రంగులు పూయించింది. వెండితెరపై కొంటె చూపుతో ఏదో మాయజేసింది. హైదరాబాద్‌తో దోస్తీ చేస్తూనే ఎన్నో మజిలీలు దాటి అందరికీ దగ్గరయ్యింది స్వాతి. ఇంటర్ నుంచి సిటీలైఫ్ ఎంజాయ్ చేస్తున్న స్వాతి.. ఆ విశేషాలు ‘సిటీప్లస్’తో ఇలా పంచుకుంది.
హాయ్.. దిసీజ్ యువర్స్ స్వాతి. నేను పుట్టింది రష్యాలో. ముంబై, వైజాగ్‌లో పెరిగి ఇదిగో.. ఇప్పుడు హైదరాబాద్‌లో సెటిలయ్యాను. నేను ఎంత అల్లరి దాన్నైనా.. నా చిన్నతనం అంతా ఓ డిఫరెంట్ వాతావరణంలో సాగింది. నాన్న నేవీలో పనిచేసేవారు. అక్కడి క్వార్టర్స్‌లో అన్నీ పద్ధతిగా జరిగేవి. దీంతో నేనూ పద్ధతిగానే పెరిగాను.
చిక్కడపల్లి ది బెస్ట్
హైదరాబాద్‌తో నా ఫస్ట్ క్రష్ ఇంటర్‌లోనే. నేను ఇంటర్‌కు వచ్చే సరికి అమ్మావాళ్లు హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉండేవాళ్లం. నారాయణగూడలోని రత్న కాలేజీలో చేరాను. అప్పటిదాకా కాస్త బిడియంగా పెరిగిన నేను.. ఇక్కడ చాలా విషయాల్లో కన్ఫ్యూజ్ అయ్యాను. సిటీబస్సు స్టాప్‌లో ఆగేది కాదు. రన్నింగ్‌లో ఎక్కడం, దిగడం తెలియక.. తికమకపడిపోయేదాన్ని. కాలేజ్ జర్నీలో మధ్యలో చిక్కడపల్లి తగిలేది. అక్కడే మా స్నేహితురాలి ఇల్లు కూడా ఉండేది. ఆ ఏరియా అంటే నాకిప్పటికీ ఎంతో ఇష్టం. అక్కడ ఎప్పుడూ పండుగ వాతావరణం ఉంటుంది. వినాయకచవితి, దసరా, దీపావళి ఇలా రకరకాల పండుగలకు ఆ ప్రాంతాన్ని రకరకాలుగా అలంకరిస్తారు.
చుడీ, సుల్తాన్ బజార్లలో..
ఇంటర్ అయిపోయిన తర్వాత వేసవిలో సరదాగా యాంకరింగ్ మొదలుపెట్టాను. మా ఆంటీ లక్ష్మీ మేకపాటి ద్వారా టీవీలో యాంకరింగ్ చాన్స్ వచ్చింది. కలర్స్ ప్రోగ్రామ్‌తో మీ అందరికీ దగ్గరయ్యా. తర్వాత సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నా అమ్మే నాకు బెస్ట్ ఫ్రెండ్. షాపింగ్‌కు వెళ్లాలన్నా అమ్మతోనే వెళ్లేదాన్ని. చార్మినార్ ద గ్గర చుడీ బజార్, కోఠి దగ్గర సుల్తాన్ బజార్లో షాపింగ్ తెగ చేసేవాళ్లం. షాపింగ్ పూర్తి చేసుకుని రాత్రి 11 గంటలకు ఇంటికొస్తూ.., మొజాంజాహి మార్కెట్లోని ఫేమస్ ఐస్ క్రీమ్ సెంటర్లో ఐస్‌క్రీమ్ లాగించేవాళ్లం. సీతాఫలం ఫ్లేవర్ అంటే నాకు ఇష్టం. హైదరాబాద్ వచ్చాకే హలీం అంటే ఏంటో తెలిసింది. ప్యారడైజ్ బిర్యానీ టేస్టే వేరు.
సంగీత్ పక్కషాపులో బర్గర్..
సికింద్రాబాద్ సంగీత్ థియేటర్లో ఇంగ్లిష్ పిక్చర్స్ బాగా నడిచేవి. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లేదాన్ని. థియేటర్ పక్కనే ఉన్న బేకరీలో రూ.20 పెడితే టేస్టీ బర్గర్ వచ్చేది. బంజారాహిల్స్‌లో మహారాజా చాట్‌లో.. సమోసా చాట్ చాలా టేస్ట్‌గా ఉంటుంది. స్వీట్లెస్ చాట్ మరింత బాగుంటుంది.
యూసుఫ్‌గూడలో డిగ్రీ
ఎప్పుడైతే యాంకరింగ్ మొదలుపెట్టానో బయట ఫ్రీగా తిరగడం మిస్సయ్యాను. యూసుఫ్‌గూడ సెయింట్ మేరి కాలేజీలో డిగ్రీలో చేరిన తర్వాత.. ఫ్రెండ్స్ టీజ్ చేసేవారు. షూటింగ్ షెడ్యూల్స్‌తో క్లాసులు మిస్సయ్యేదాన్ని. బేసికల్‌గా నాకు చదువంటే ఇష్టం. ఈ గ్లామర్ ఫీల్డ్‌కు రాకపోయుంటే 9 టు 5 జాబ్ ఏదైనా చేసుకునేదాన్ని.
కోఠీలో సెకండ్‌హ్యాండ్ పుస్తకాలు
మొదట్నుంచీ నేను గుడ్ స్టూడెంట్‌నే.. నవలలు, పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు బాగా చదువుతుంటాను. ఫిక్షన్, రొమాంటిక్ నావెల్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కోఠి ఉమెన్స్ కాలేజ్ లైన్లో సెకండ్ హ్యాండ్ పుస్తకాలు దొరికేవి. అక్కడికి నాన్నతో వెళ్లి నాకు కావాల్సిన బుక్స్ తెచ్చుకునేదాన్ని. అక్కడికి వెళ్లామంటే గోకుల్ చాట్‌లో మిర్చి తినందే వచ్చేవాళ్లం కాదు.
- శిరీష చల్లపల్లి