యూఏఈ వెళ్తున్న బరువైన మహిళ
దుబాయ్: ప్రపంచంలో అత్యంత బరువైన మహిళగా గుర్తింపు పొందిన ఈజిప్టుకు చెందిన ఇమాన్ అబ్దుల్ అట్టి అబుదాబిలోని ఆసుపత్రికి మారనుంది. చికిత్స కోసం అట్టిని ప్రత్యేక కార్గో విమానం ద్వారా ముంబైలోని సైఫీ ఆసుపత్రికి వచ్చిన విషయం తెలిసిందే. అట్టికి పలుమార్లు బెరియాట్రిక్ ఆపరేషన్ నిర్వహించిన సైఫీ ఆసుపత్రి వైద్యులు ఆమె బరువును 500 కేజీల నుంచి 176 కిలోలకు తగ్గించారు.
అట్టి కుటుంబసభ్యులకు, ఆమెకు వైద్యం చేస్తున్న డాక్టర్ మప్ఫాజల్ లక్డావాలాకు మధ్య విభేదాలు తలెత్తడంతో వైద్యం కోసం అట్టి సోదరి సెలీమ్ అబుదాబీలోని బుర్జీల్ ఆసుపత్రిని సంప్రదించారు. అట్టికి వైద్యం చేసేందుకు వారు అంగీకరించడంతో ఈజిప్టు ఎయిర్‌కు చెందిన ప్రత్యేక విమానం ఎయిర్‌బస్ 300లో అట్టిను అబుదాబి తరలించనున్నారు.
ఈ సమయంలో ఐసీయూలో వినియోగించే అన్ని రకాల వస్తువులు, మెడిసన్లను విమానంలో అందుబాటులో ఉంచుకుంటామని బుర్జీల్ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. కాగా, వైద్య చికిత్స కోసం వస్తున్న అట్టీ, ఆమె సోదరికి యూఏఈ ప్రభుత్వం 90 రోజుల వీసాను మంజూరు చేసింది.