త్వరలో ఆటో, ట్యాక్సీ చార్జీల పెంపు?
- డిమాండ్ చేస్తున్న పలు యూనియన్లు
- 11న ఆర్టీఏ, ఎమ్మెమ్మార్డీఏ అధికారుల సమావేశం
సాక్షి, ముంబై: బెస్ట్ బస్సు చార్జీల పెంపుతో సతమతమవుతున్న ముంబైకర్లపై త్వరలో ట్యాక్సీ, ఆటో చార్జీల భారం పడనుంది. పెరుగుతున్న ఇంధనం ధరలు, వాహనాల మరమ్మతులు, నిర్వాహణ భారంవల్ల చార్జీలు పెంచాలని ట్కాక్సీ, ఆటో యజమానులు, యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. పెంపుపై రీజినల్ ట్రాన్స్పోర్టు అథారిటీ (ఆర్టీఏ), ముంబై మహానగర ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) అధికారులు ఈ నెల 11న సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో చార్జీల పెంపునకు ఆమోదం లభిస్తే మరుసటి రోజునుంచి ప్రజలపై రూపాయి చొప్పున భారం పడనుంది. చార్జీల పెంపుపై యూనియను గతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించడంతో హకీం కమిటీ నియమించింది.
కమిటీ సిఫార్సు ప్రకారం 2012 జూలై 27న చార్జీల పెంపుపై ప్రతిపాదన రూపొందించింది. ఆ ప్రకారం ప్రతి ఏడాది మే 1న రూపాయి చొప్పున చార్జీలు పెంచుతూ వస్తున్నారు. అయితే అప్పట్లో చార్జీల పెంపు వ్యతిరేకిస్తూ ప్రయాణికుల సంఘాలు కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. 2012లో ఆటో చార్జీలు రూ. 15 (మినిమం) ఉండగా ప్రస్తుతం రూ. 17 వసూలు చేస్తున్నారు. అలాగే ట్యాక్సీ చార్జీలు రూ. 19 (మినిమం) ఉండగా ప్రస్తుతం రూ. 21 వసూలు చేస్తున్నారు. హకీం కమిటీ నిర్ణయం ప్రకారం ప్రతి ఏడాది మే 1న కొత్త చార్జీలు అమలులోకి రావాలి. కాని వారం రోజులు గడిచినా చార్జీలు పెంచేందుకు ఎమ్మెమ్మార్డీయే అనుమతివ్వడం లేదు. సోమవారం ఈ విషయమై చర్చలు జరగనున్నాయి. చర్చలు సఫలీకృతమవుతాయని ట్యాక్సీ మెన్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎ.ఎన్.క్వాడ్రోస్, ఆటో మెన్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శశాంక్రావ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త చార్జీలు అమలులోకి వస్తే ఆటో కనీస చార్జీలు రూ.18, ట్యాక్సీ కనీస చార్జీలు రూ. 22 కానున్నాయి.