పేర్వారం వర్సెస్ ఆంజనేయరెడ్డి
రాష్ట్ర విభజనపై ఇద్దరు ఐపీఎస్ మాజీ అధికారులు మాటల తూటాలు విసురుకుంటున్నారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరు మాజీ ఉన్నతాధికారుల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా సాగుతోంది. రాష్ట్రం ముక్కలయితే మంచిదని ఒకరంటే, కలిసుంటేనే కలదు సుఖమని మరొకరంటున్నారు. రాష్ట్రం విడిపోవాలని టీఆర్ఎస్ పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్న మాజీ డీజీపీ పేర్వారం రాములు కోరుకుంటున్నారు. విడిపోతే చెడతామంటూ ప్రజారాజ్యం పార్టీలో కీలకపాత్ర పోషించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సి.ఆంజనేయరెడ్డి అంటున్నారు.
రాములు పార్టీ వేదికగా విభజన గళం విన్పిస్తుండగా, ఆంజనేయరెడ్డి ‘రాష్ట్ర పరిరక్షణ వేదిక’ ద్వారా సమైక్య వాణి విన్పిస్తున్నారు. రాష్ట్ర విభజన వల్ల తెలుగు భాష, జాతి, సంస్కృతి నాశనమవుతాయని ఆంజనేయరెడ్డి ఆవేదన చెందుతున్నారు. విభజన జరిగితే.. కేసీఆర్ కుటుంబం ఆగడాలు అధికమవుతాయని 'దొరసేన' పేరుతో పరోక్షంగా ప్రస్తావించారు. రాష్ట్రం విడిపోతే దొరసేన విజృంభిస్తుందని, నక్సల్స్‌ను మించిన దోపిడీతరం వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ముంబైలో శివసేన తరహాలో ఇక్కడ దొరసేన తయారైందని, ఉద్యమ నేత కొడుకు, కూతురు, మేనల్లుడు.. సినిమా, పారిశ్రామిక రంగాల వారి నుంచి బలవంతంగా వసూళ్లు చేస్తున్నారని ఆంజనేయరెడ్డి ఆరోపించారు. ఆంధ్రావాలే బాగో అంటున్నవారు.. తర్వాత గుజరాతీ, రాజస్థానీ బాగో అనరనే గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు. హైదరాబాద్ ఇప్పటికే ఉగ్రవాదానికి కేంద్రంగా మారిందని, అది మరింత పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. అన్నివాదాల కంటే ప్రాంతీయవాదం ప్రమాదకరమని, రాష్ట్ర విభజన తర్వాత అది కులవాదం, మతవాదంగా రూపాంతరం చెందుతుందని అభిప్రాయపడ్డారు.
విభజనపై ఆంజనేయ రెడ్డి ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని పేర్వారం రాములు విమర్శించారు. అసలు సీమాంధ్ర నుంచే తెలంగాణకు నక్సలిజం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. 1980కు ముందు తెలంగాణలో నక్సలిజమే లేదని, ఈ విషయం ఆంజనేయరెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. నక్సలిజం తెలంగాణకే పరిమితమైన సమస్యగా చిత్రీకరించే కుట్రకు సీమాంధ్రులు పాల్పడుతున్నారని, ఇవన్నీ ఆంజనేయరెడ్డికి తెలియకుండానే మాట్లాడుతున్నాడా అని నిలదీశారు. ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవితో సామాజిక తెలంగాణ అన్పించారని, రాష్ట్ర విభజనపై అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని ధ్వజమెత్తారు. పేర్వారం, ఆంజనేయరెడ్డి మాటల యుద్ధం ఎంతవరకు వెళుతుందో చూడాలి.