ఏజెన్సీలో సవాల్..!
దగ్గర పడుతున్న మలివిడత పోలింగ్
అధికారుల్లో పెరుగుతోన్న టెన్షన్
మన్యంలో మకాం వేసిన దళసభ్యులు
ఈస్టు డివిజన్లో అడుగుపెట్టిన మావోయిస్టు అగ్రనేత ?
గుత్తి కోయలు భారీగా ఉన్నట్టుగా సమాచారం
కూంబింగ్ ఉధృతం చేసిన పోలీసులు
కొయ్యూరు, న్యూస్‌లైన్: ఏజెన్సీలో ‘పరిషత్’ పోలింగ్‌కు మూడు రోజులే గడువుంది. సమయం దగ్గరపడుతున్న కొద్దీ అందరిలో టెన్షన్ పెరిగిపోతోంది. మన్యంలో ఎన్నికల నిర్వహణ ఎప్పుడూ సవాలే. మలివిడతగా ఈ నెల 11న మన్యంలోని 11 మండలాలతోపాటు సరిహద్దులోని మరో ఆరింట ప్రశాంతంగా నిర్వహణ పోలీసులకు కత్తిమీదసాము లాంటిదే. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కేంద్రాల కంటే స్థానిక ఎన్నికల పోలింగ్ కేంద్రాలు అధికంగా ఉన్నాయి. దీంతో ప్రతీ కేంద్రం వద్ద గట్టి భద్రత చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు విధ్వంసాల కోసం కాచుకుని ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిని ధ్రువపరుస్తూ మన్యమంతటా పోస్టర్లు బ్యానర్లతో ప్రచారం చేస్తున్నారు. ఈస్టు డివిజన్లో ఏవోబీ మిలటరీ కమిషన్ ఇన్చార్జి చలపతి ఆధ్వర్యంలో ఒక బృందం సంచరిస్తున్నట్టు పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉంది. ఆయన ఏదైనా విధ్వంసానికి వ్యూహరచన చేసే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో కొయ్యూరు, జీకేవీధి సరిహద్దుల్లో కూంబింగ్ ఉధృతం చేశారు. దళాలకు తోడుగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సుమారు వంద మంది వరకు గుత్తికోయలు కూడా వచ్చారని భోగట్టా.
నెలరోజుల కిందట ఏడు యాక్షన్ టీంలను ఏర్పాటు చేసినట్టు సమాచారంతోరాజకీయ పార్టీల నేతలకు నోటీసులు పంపి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఆదేశించారు. ఈమేరకు పలువురు మారుమూల ప్రాంతాలకు వెళ్లడం మానేశారు. ప్రతి ఎన్నికల్లోనూ మావోయిస్టులు హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్నారు. 1999లో బూదరాళ్ల పోలింగ్ కేంద్రంపై దాడి చేసి బ్యాలెట్ బాక్సులను ఎత్తుకుపోయారు. 2004లో పలకజీడిలో జీపును దగ్ధం చేశారు.
2009లో పోలింగ్‌కు వారంరోజుల ముందు జీపును కాల్చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వారి పోకడ అందరికీ తెలిసిందే. దీంతో గూడెం కొత్తవీధి-కొయ్యూరు సరిహద్దు గ్రామాల్లో కూంబింగ్ ఉధృతం చేశారు. కాగా అతి కొద్ది ఓట్లు గెలుపు ఓటములను నిర్దేశించే ‘పరిషత్’ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు నిగ్రహం కోల్పోవడం సర్వసాధారణం. ఇక గ్రామాల్లో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ తదితర పార్టీల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది.
అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందన్న వాదన ఉంది. ఇదే అదనుగా ఏవోబీలో తమ ఉనికిని చాటుకోవడానికి మావోయిస్టులు తహతహలాడుతున్నారు. ముఖ్యంగా కొయ్యూరు, జీకేవీధి, జి.మాడుగుల,చింతపల్లి, పెదబయలు,ముంచంగిపుట్టు మండలాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు సమస్యాత్మక గ్రామాలను గుర్తించి తగిన బందోబస్తుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.