బీసీలకు ప్రత్యేక బ్యాంకులు ఏర్పాటు చేయాలి
శ్రీకాకుళం అర్బన్: బీసీలకు ప్రత్యేక బ్యాంకులు ఏర్పాటు చేయాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్యాం కుల సేవలు బీసీలకు సరిగా అందడం లేదని ఆరోపిస్తూ సంఘం ఆధ్వర్యంలో పలు బ్యాంకు కార్యాలయాల వద్ద సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు పి.చంద్రపతిరావు మాట్లాడుతూ భారత దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ సామాన్యునికి అందనంత ఎత్తులో ఉందని, కార్పొరేట్, రాజకీయ వర్గాలకే సేవలు పరిమితమవుతున్నాయని ఆరోపించారు. మహిళలకు ప్రత్యేకంగా మహిళా బ్యాంకులు ఏర్పాటు చేసినట్టే బీసీలకు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకు లింకేజీ తీసివేసి లబ్ధిదారులకు నేరుగా రుణాలు మంజూరు చేయాలన్నారు. 2013-14 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం బీసీలకు కేటాయించే సంక్షేమ పథకాలకు రూ.700 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు.
అంటే ప్రతి బీసీ వ్యక్తికి కేవలం రూ.10 మాత్రమే పడుతుందన్నారు. పార్లమెంట్ ఓబీసీ కమిటీ నివేదిక ప్రకారం 27 శాతం ఉద్యోగ కోటాలో కేవలం 7శాతం మాత్రమే ఓబీసీలు ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. అనంతరం బీసీ నాయకులు జీటీరోడ్డులోని ఆంధ్రాబ్యాం కు, భారతీయ స్టేట్ బ్యాంకు వద్ద ధర్నా చేసి ఆయా బ్యాంకు మేనేజర్లకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ కన్వీనర్ డీపీ దేవ్, బీసీ సంఘ ప్రతినిధులు కె.గజపతిరావు, కె.అప్పారావు, కటకం నాగేశ్వరరావు, బోయిన గోవిందరాజులు, జి.రామారావు, కె.రమేష్, కె.వేణు, కె.వీరాస్వామి, ఎ.హరిబాబు, టి.ఆదినారాయణ, కె.లక్ష్మీనారాయణ, కింతలి రాము, మైలపల్లి లక్ష్ముడు తదితరులు పాల్గొన్నారు.