పులస చేప.. మంచి విందు!
‘‘గోదావరిపై చాలా సినిమాలొచ్చాయి. సత్యం, ఇళయరాజా వంటి గొప్ప గొప్ప సంగీత దర్శకులు గోదావరిపై మంచి పాటలు స్వరపరిచారు. ఈ సినిమాలో నేను గోదావరి ఫేమస్ పులస చేపపై పాట చేశా. దానికి మంచి స్పందన వస్తోంది. వీనుల విందుగా ఉందని అందరూ అంటున్నారు. గొప్ప పాటల సరసన ఈ పాట నిలుస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు సంగీత దర్శకుడు రఘు కుంచె.
రాజా రామ్మోహన్ చల్లా దర్శకత్వంలో తూము రామారావు, రాజేశ్ రంబాల, బొమ్మన సుబ్బారాయుడు నిర్మించిన సినిమా ‘కేరాఫ్ గోదావరి’. ఈ నెల 24న రిలీజవుతోన్న ఈ చిత్రానికి రఘు కుంచె సంగీత దర్శకుడు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘గోదావరి, ఆ నదిలో ప్రయాణం గురించి ఎంత చెప్పినా తక్కువే. కొత్త హీరో హీరోయిన్లతో గోదావరి నదిపై తీసిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు. నిర్మాతల్లో ఒకరైన బొమ్మన సుబ్బారాయుడు సహా చిత్ర బృందం పాల్గొన్నారు.