ముస్తాబైన గోల్కొండ
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవానికి గోల్కొండ కోట ముస్తాబైంది. గతేడాది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గోల్కొండ కోటలోనే అధికారికంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించిన రాష్ర్ట ప్రభుత్వం.. ఈ ఏడాదీ అక్కడే ఘనంగా వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది. కోటలోని రాణి మహల్ లాన్స్‌ను పూలతో అందంగా అలంకరించటంతోపాటు కోటను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు భారీ ఎత్తున లైటింగ్ ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం 9.20 గంటలకు సీఎం కేసీఆర్ అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించి గోల్కొండ కోటకు చేరుకుంటారు. 9.50 గంటలకు పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. పది గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగిస్తారు.
గ్రామజ్యోతికి శ్రీకారం: గ్రామజ్యోతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంద్రాగస్టు వేడుకల సందర్భంగా లాంఛనంగా ప్రారంభించనుంది. ప్రజల భాగస్వామ్యంలో పల్లెపల్లెనా గ్రామ స్వరాజ్యం తేవాలని.. స్వచ్ఛ భారత్ తరహాలో ‘స్వచ్ఛ గ్రామం’ కార్యక్రమం చేపట్టాలని సీఎం నిర్ణయించారు. ఇప్పటికే విధివిధానాలను రూపొందించారు. గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో అయ్యే పనులు సమష్టి కృషితో నిర్వహిస్తూనే గ్రామ స్థాయిలోనే ప్రణాళికలు తయారు చేసి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం తరఫున సాయం అందించాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దీంతోపాటు ప్రభుత్వోద్యోగాల నియామకాలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, డబుల్ బెడ్రూం ఇళ్లు, హరితహారం, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాలపై సీఎం తన సందేశంలో స్పష్టత ఇవ్వనున్నారు.
రాష్ట్ర ప్రజలకు సీఎం శుభాకాంక్షలు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా పంద్రాగస్టు వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
పది గంటలకు జెండావందనం
రాష్ట్రంలో జాతీయ పతాకావిష్కరణ వేళలు మారాయి. ఏటా ఆగస్టు 15న అన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం 9 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో మంత్రుల ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ఆనవాయితీ. అయితే ఆఖరి నిమిషంలో ఈ వేళలను మార్పు చేయాలని సీఎం కార్యాలయం నిర్ణయించింది.
అన్ని జిల్లా కేంద్రాల్లోనూ 10 గంటలకు జాతీయ పతాకావిష్కరణ చేయాలని శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం గోల్కొండ కోటలో ఉదయం పదికే సీఎం కేసీఆర్, జిల్లాల్లో సీనియర్ మంత్రులు పతాకావిష్కరణ చేస్తారు. అయితే ఈ ఆకస్మిక మార్పుతో అన్ని జిల్లాల్లోనూ అధికారులు గందరగోళానికి గురయ్యారు. వేడుకలను ఉద్దేశించి సీఎం, మంత్రులు చేసే ప్రసంగాల్ని సమాచార పౌర సంబంధాల శాఖ ముందుగానే సిద్ధంచేసి, అధికారికంగా ముద్రించి మీడియాకు పంపిణీ చేసేది. ఈ విధానానికి సైతం స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గవర్నర్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్టు 15 అంకితభావాన్ని, గత స్మృతులను స్మరించుకోవాల్సిన దినమని ఆయన పేర్కొన్నారు. తరాల తరబడి త్యాగం, సమరయోధుల నిస్వార్థ పోరాటం మేలు కలయికతో స్వాతంత్య్రం సిద్ధించిందని తెలిపారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా చిన్నాపెద్దా తేడాలు లేకుండా దేశం యావత్తూ స్వాతంత్య్రం కోసం ఒక్కటై నిలిచిందని అన్నారు. స్వాతంత్య్ర ఫలాలను అనుభవిస్తున్న మనం వారి పోరాట స్ఫూర్తికి తలవంచి నమస్కరించాలని ఆయన ఒక సందేశంలో పేర్కొన్నారు.