కాంగ్రెస్లో మళ్లీ అసమ్మతి
అసంతృప్తిని బయటపెడుతూ జాఫర్ షరీఫ్ సోనియాకు లేఖ
సీఎం ఇబ్రహీంకు ఎనలేని ప్రాధాన్యతపై అసహనం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కర్ణాటక కాంగ్రెస్లో మళ్లీ అసమ్మతి తలెత్తింది. బెంగళూరు సెంట్రల్ నియోజక వర్గం టికెట్టును ఆశించి భంగపడిన పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సీకే. జాఫర్ షరీఫ్ ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆదివారం లేఖ రాశారు. అనాదిగా పార్టీని నమ్ముకుని ఉన్న వారిని సీఎం పక్కన పెట్టారని అందులో ఆరోపించారు.
మైనారిటీలు ఏ మాత్రం ఇష్టపడని సీఎం ఇబ్రహీంకు ఎనలేని ప్రాధాన్యతను ఇస్తున్నారని పేర్కొన్నారు. అమానత్ సహకార బ్యాంకులో కోట్ల రూపాయల కుంభకోణం చోటు చేసుకోవడం వల్ల పేదలైన డిపాజిటర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు చేపట్టాలని లేఖ రాసినా ముఖ్యమంత్రి స్పందించ లేదని ఆరోపించారు.
ఈ పరిస్థితుల నడుమ ప్రస్తుత లోక్సభ ఎన్నికల సందర్భంగా తాను తటస్థ వైఖరిని అవలంబించాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ మొండి చేయి చూపడంతో జేడీఎస్ తీర్థం పుచ్చుకోవాలని షరీఫ్ ఒకానొక దశలో నిర్ణయించారు. ఆయనను మైసూరు నుంచి బరిలో దింపాలని ఆ పార్టీ కూడా నిర్ణయించింది.
ఇటీవల మక్కా యాత్రకు వెళ్లిన ఆయనను కాంగ్రెస్ అధిష్టాన ం ఫోనులో సంప్రదించి బుజ్జగించినట్లు తెలిసింది. దీంతో ఆయన యథావిధిగా కాంగ్రెస్ తరఫున ప్రచారంలో పాల్గొంటారని అందరూ భావించారు. ఉన్నట్లుండి తటస్థ వైఖరిని అనుసరించాలని ఆయన నిర్ణయించుకోవ డంతో ఎన్నికల్లో కాంగ్రెస్కు నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.
రెఫరెండం కాదు : సీఎం
లోక్సభ ఎన్నికల ఫలితాలు తన పది నెలల పాలనపై రెఫరెండం కాబోవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. గుల్బర్గలో ఆదివారం ఆయన ‘మీట్ ది ప్రెస్’లో మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వ పదేళ్ల పాలన, రాష్ట్ర ప్రభుత్వ పది నెలల సాధనలపై ప్రచారం చేస్తూ ఓట్లను అర్థిస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం 28 స్థానాలకు గాను కాంగ్రెస్ 18 నుంచి 20 సీట్లను గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా పార్టీలో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటామని ఆయన తెలిపారు. సమైక్యంగా ఎన్నికలను ఎదుర్కొంటామని చెప్పారు.