బాక్సైట్ కోసమే కొత్త చట్టం
సీలేరు: ఏజెన్సీలోని రూ.కోట్లు విలువైన ఖనిజ సంపదను తవ్వి తరలించుకుపోయేందుకే ప్రభుత్వం భూసేకరణలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని రాష్ట్ర పౌరహక్కుల సంఘ ప్రధాన కార్యదర్శి సీహెచ్ చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్రపౌరహక్కుల సంఘం సభ్యులు శనివారం బాక్సైట్ ఉన్న జీకేవీధి మండలం సప్పర్ల, గాలికొండ, ఎ.దారకొండ ప్రాంతాల్లో పర్యటించారు.
ఆయా గ్రామాల్లోని గిరిజనులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.బాక్సైట్‌కు వ్యతిరేకంగా ముద్రించిన కరపత్రాలను వారపుసంతలో పంపిణీ చేశారు. భూసేకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖనిజ సంపదను దోచుకోవడానికి వ్యతిరేకంగా ప్రతి గిరిజనుడు పోరాడాలని పిలుపునిచ్చారు. బాక్సైట్ తవ్వకాలతో గిరిజనులకు మరణశాసనమేనని అన్నారు.
ఏళ్ల తరబడి ఆదివాసీల ఆధీనంలో ఉన్న భూములను లాక్కోవడానికే కొత్త చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. కోర్టులో కేసు వేసుకునేందుకు వీలు లేకుండా చట్టాన్ని రూపొందించారన్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర నాయకులు మనోహర్, సుదర్శన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.చిట్టిబాబు, జాయింట్ సెక్రటరీ నారాయణరావు, నాయకురాలు అన్నపూర్ణ, విశాఖ జిల్లా జోనల్ జాయింట్ సెక్రటరీ జయంత్, సహాయ కార్యదర్శి సూర్యనారాయణ రావు, జిల్లా కోశాధికారి జ్ఞానానందం పాల్గొన్నారు.