బడి నోచని బాల్యం
పాఠశాలలకు రాని..ఇళ్ల వద్ద ఉంటున్న విద్యార్థుల లెక్క తేలింది. ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో బడిబయటి పిల్లల వివరాలు ఆర్వీఎం అధికారుల సర్వేలో నమోదయ్యాయి. వందల్లో బాలలు అక్షర బుద్ధులకు దూరమైనట్లు గుర్తించారు. కొందరు ఉపాధ్యాయులు బడుల్లో విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపి..అధికారులను పక్కదారి పట్టించినట్లు తేలడం విశేషం.
జిల్లాలో 1,289 మంది పిల్లల గుర్తింపు
ఖమ్మం: జిల్లా వ్యాప్తంగా 1,289 మంది చిన్నారులు బడి బయటనే ఉన్నారు. సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ అధికారుల ఆదేశాలతో ఇటీవల పలువురు హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, సెక్టోరియల్ అధికారుల కమిటీలు నిర్వహించిన సర్వేలో వివరాలు తేలాయి. 750 మంది బాలురు, 539 బాలికలు అక్షరబుద్ధులకు దూరంగా ఉన్నట్లు గుర్తించారు. అత్యధికంగా దుమ్ముగూడెం మండలంలో (114మంది) 63 మంది బాలురు, 51 మంది బాలికలు ఉన్నారు.
అశ్వారావుపేట మండలంలో 29 మంది బాలురు, 21 మంది బాలికలు, వాజేడు మండలంలో 59 మంది, వెంకటాపురంలో 65, పాల్వంచ70 మంది, చర్ల 86, ముల్కలపల్లి 91, దమ్మపేటలో 61, సత్తుపల్లిలో 55, పెనుబల్లి 51, ఇల్లెందు మండలంలో 49 మంది బాలలు ఉన్నారు. మైదాన ప్రాంతం కంటే ఏజెన్సీలోనే బడిబయటి బాలబాలికలు అధికం. సర్వేలో నమోదైన సంఖ్య కంటే..ఎక్కువగానే వీరి సంఖ్య ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సంఖ్యను పెంచి..నెట్టుకొచ్చారా..?
విద్యార్థుల రేషలైజేషన్ ప్రక్రియ సందర్భంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల సంఖ్యను అధికంగా చూపించి పోస్టులు కాపాడుకున్నట్లు తేలింది. 20మంది విద్యార్థులున్న పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడు, 21 - 60 మంది విద్యార్థులుంటే ఇద్దరు, 61- 90 మందికి ముగ్గురు ఉపాధ్యాయులు ఉండొచ్చు. విద్యార్థుల సంఖ్య తక్కువ చూపితే తమ పోస్టు పోతుందని..సంఖ్యను అధికంగా చూపించుకొని కొన్నిచోట్ల విధులు నిర్వహిస్తున్న విషయం బయటపడింది.
ప్రధానంగా ఖమ్మం అర్బన్, సత్తుపల్లి, తల్లాడ మండలాల్లో ఈ తంతు ఉంది. బడిబయటి పిల్లలను కూడా పాఠశాలల రిజిష్టర్లలో చూపి..కొందరు పాఠ్యపుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం బిల్లులు కూడా తీసుకున్నారు. మరి ఉన్నతాధికారులు పిల్లలను బడిలో చేర్పించేందుకు, తప్పుడు లెక్కలు చూపిన వారిపై చర్యలకు ఏం చేస్తారో చూడాల్సిందే.