అమ్మానాన్న లేరు.. ఆదుకోండి సారు..
రెవెన్యూ దర్బార్‌లో అదనపు జేసీకి చిన్నారుల వినతి
నవాబుపేట: ‘మా అమ్మ, నాన్న చనిపోయారు. ఎందుకు చనిపోయారో తెలియదు. ఇద్దరం మా నానమ్మ దగ్గర ఉండి చదువుకుంటున్నాం.. మమ్మల్ని ఆదుకోండి సారూ..’’ అంటూ ఇద్దరు చిన్నారులు రెవెన్యూ దర్భార్‌లో అదనపు జేసీ బాలాజీ రంజిత్‌ప్రసాద్‌కు విన్నవించుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం హన్మసానిపల్లిలో గురువారం ఏర్పాటు చేసిన రెవెన్యూ దర్బార్‌కు చిన్నారులు వంశీ(11), మురళి(8) వచ్చారు.
వీరి తల్లి యాదమ్మ నాలుగేళ్ల క్రితం ఉరేసుకుంది. తండ్రి యాదయ్య(41) రెండేళ్ల క్రితం పురుగుమందు తాగి చనిపోయాడు. ఆనాటి నుంచి ఆ పిల్లలను నాయనమ్మ అంజమ్మ చేరదీసి చదివిస్తోంది. అయితే ఆమెకు వయస్సు పైబడింది. దీంతో చిన్నారులు రెవెన్యూ దర్బార్‌కు వచ్చి మొరపెట్టుకున్నారు. దీనికి చలించిన ఏజేసీ ఆ చిన్నారుల ను రెసిడెన్షియల్ పాఠశాలలో చదివించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆ కుటుంబానికి అంత్యోదయకార్డు అందిస్తున్నట్లు ఆర్డీవో తెలిపారు.