chit money
-
టీడీపీ నేత దాష్టీకం
కుప్పం: చీటీ డబ్బులు సకాలంలో చెల్లించలేదనే కారణంతో ఏడేళ్ల బిడ్డతో సహా తల్లిని గృహనిర్బంధం చేసిన ఓ టీడీపీనేత నిర్వాకం వెలుగుచూసింది. శాంతిపురం మండలంలోని ఎం.కె.పురం పంచాయతీ కృష్ణాపురంలో మంగళవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణాపురానికి చెందిన టీడీపీ బూత్ కమిటీ నాయకుడు ప్రకాష్ గ్రామంలో చీటీలు నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన పాండురంగ ఇతని వద్ద చీటీ వేసి పాడుకున్నాడు. ఇందుకు సంబంధించిన డబ్బులు సకాలంలో ఇవ్వలేదని మంగళవారం రాత్రి పాండురంగ ఇంటి వద్దకు వెళ్లిన ప్రకాష్ గొడవకు దిగాడు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న పాండురంగ గుడిలో ఉన్నాడని భార్య భవాని (26) చెప్పినా వినిపించుకోకుండా వీధిలో నిలబడి నానా బూతులు తిట్టాడు. భవాని, తన కూతురు చిద్విలాసిని (7) వెంటనే ఇల్లు విడిచిపోవాలని హుకుం జారీ చేశాడు. ఎలాగోలా అప్పు తీర్చేస్తామని ఆమె వేడుకున్నా కనికరించకుండా తల్లీబిడ్డలు ఇంట్లో ఉండగానే ఇంటి బయట తాళం వేసుకుని వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో బాధితులు పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం ఇచ్చారు. రాళ్లబూదుగూరు పోలీసులు తాళాలు తెరిపించి తల్లీబిడ్డలకు గృహనిర్బంధం నుంచి విముక్తి కలిగించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ మునిస్వామి తెలిపారు. -
స్నానాల గదిలో బంధించారు..
హైదరాబాద్ : తనకు రావాల్సిన చిట్ డబ్బులు అడిగిన ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెను బాత్రూంలో నిర్బంధించి హింసించిన వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ యాదగిరినగర్‌లో నివసించే నర్సింహులు కొంత కాలంగా చిట్స్ వ్యాపారం చేస్తున్నాడు. అదే బస్తీకి చెందిన మహాలక్ష్మి నర్సింహులు వద్ద చిట్ వేసి ఇటీవలే పాడుకుంది. కాగా నర్సింహులు ఆమెకు రూ.3.80 లక్షలు ఇవ్వాల్సి ఉంది. కానీ నర్సింహులు డబ్బులు ఇవ్వకపోగా, కొన్ని రోజుల నుంచి ఆమెకు అసభ్యకర సందేశాలు పంపిస్తూ ఇంటికి రావాలని వేధిస్తున్నాడు. రెండు రోజుల క్రితం మహాలక్ష్మి డబ్బుల కోసం నర్సింహులు ఇంటికి వెళ్లగా తన కుటుంబ సభ్యులతో కలసి ఆమెపై దాడి చేసి, తర్వాత ఆమెను స్నానాల గదిలో బంధించారు. కష్టపడి నిందితుల చెర నుంచి తప్పించుకున్న బాధిత మహిళ మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నర్సింహులును బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నర్సింహులుతో పాటు ఆయన భార్య ఉమ, కొడుకు అఖిల్, అల్లుడు శ్రీధర్‌పై కూడా కేసులు నమోదు చేశారు.