హైదరాబాద్ : తనకు రావాల్సిన చిట్ డబ్బులు అడిగిన ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెను బాత్రూంలో నిర్బంధించి హింసించిన వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ యాదగిరినగర్‌లో నివసించే నర్సింహులు కొంత కాలంగా చిట్స్ వ్యాపారం చేస్తున్నాడు. అదే బస్తీకి చెందిన మహాలక్ష్మి నర్సింహులు వద్ద చిట్ వేసి ఇటీవలే పాడుకుంది. కాగా నర్సింహులు ఆమెకు రూ.3.80 లక్షలు ఇవ్వాల్సి ఉంది. కానీ నర్సింహులు డబ్బులు ఇవ్వకపోగా, కొన్ని రోజుల నుంచి ఆమెకు అసభ్యకర సందేశాలు పంపిస్తూ ఇంటికి రావాలని వేధిస్తున్నాడు.
రెండు రోజుల క్రితం మహాలక్ష్మి డబ్బుల కోసం నర్సింహులు ఇంటికి వెళ్లగా తన కుటుంబ సభ్యులతో కలసి ఆమెపై దాడి చేసి, తర్వాత ఆమెను స్నానాల గదిలో బంధించారు. కష్టపడి నిందితుల చెర నుంచి తప్పించుకున్న బాధిత మహిళ మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నర్సింహులును బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నర్సింహులుతో పాటు ఆయన భార్య ఉమ, కొడుకు అఖిల్, అల్లుడు శ్రీధర్‌పై కూడా కేసులు నమోదు చేశారు.