వందేళ్లుగా వణికిస్తున్నాయి.. నిలబడుతూనే ఉన్నాం
కొవిడ్-19 మహమ్మారితో మానవాళి సహజీవనం ఏడాదిన్నర పూర్తి చేసుకుంది. వైరస్ తీరు తెన్నులు గందరగోళంగా ఉండడంతో సరైన మందు కనిపెట్టడం పరిశోధకులకు కష్టంగా మారుతోంది. అయితే శాస్త్ర విజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ప్రమాదకరమైన అంటువ్యాధుల్ని, మహమ్మారుల్ని ఎదుర్కొన్నాం. తట్టుకుని నిలబడగలిగాం.
స్పానిష్ ఫ్లూ
ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్‌గా స్పానిష్ ఫ్లూ చెప్తుంటారు. 19వ శతాబ్దం ప్రారంభంలో విజృంభించిన ఈ వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా యాభై కోట్ల మందికి సోకినట్లు ఒక అంచనా. అదే విధంగా కోట్ల సంఖ్యలో మనుషులు స్పానిష్ ఫ్లూకి బలయ్యారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మనిషి అపరిశుభ్రమైన అలవాట్ల నుంచి పుట్టిన ఈ వైరస్.. చాలా వేగంగా ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. భారత సైనికుల ద్వారా 1918లో బాంబే(ఇప్పుడు ముంబై) నుంచి తొలి కేసు మొదలై.. రైల్వే ప్రయాణాల వల్ల మన దేశంలో వేగంగా విస్తరించింది(బాంబే ఫీవర్‌గా పిలిచారు). బ్రిటిష్ ప్రభుత్వ నిర్లక్క్ష్యంతో కోట్ల మందికి ఈ వైరస్ సోకింది. చివరికి.. విమర్శలతో మెరుగైన మందులు తీసుకొచ్చి వైద్యం అందించడం మొదలుపెట్టాక పరిస్థితి రెండేళ్లకు అదుపులోకి వచ్చింది.
కలరా
కలరా మహమ్మారి తొలిసారి 1817లో విజృంభించింది. రష్యాలో మొదలైన ఈ మహమ్మారి శరవేగంగా ప్రపంచమంతటా విస్తరించింది. దాదాపు 150 ఏళ్ల వ్యవధిలో ఏడుసార్లు కలరా మహమ్మారి మానవాళిపై పంజా విసిరింది. 1961 టైంలో ఇండోనేషియా నుంచి ఎల్ టొర్ స్ట్రెయిన్ మొదలై.. మూడేళ్ల తర్వాత మన దేశం మీద తీవ్ర ప్రభావం చూపెట్టింది. గంగా పరివాహక ప్రాంతంలో అపరిశుభ్రత, కలకత్తా(కొల్కట్టా) వాతావరణం ఈ కలరా విజృంభణకు దారితీసింది. మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ.. దీని కట్టడికి ఏడాదిపైనే సమయం పట్టింది. ఇక కలరా నివారణకు వ్యాక్సిన్‌ను 1885లోనే తయారు చేసినా.. ఈ మహమ్మారి విజృంభణ ఆగకపోవడం విశేషం. కలరా కారణంగా 1817-1923 మధ్య కాలంలో దాదాపు 3.5 కోట్ల మంది మరణించారు. ఇప్పటికీ కలరా ఉనికి ఉన్నప్పటికీ.. వైద్య రంగం అభివృద్ధితో తారా స్థాయిలో అది వ్యాపించడం లేదు.
స్మాల్ఫాక్స్
అంటువ్యాధి మశూచి. ఈజిప్ట్‌ల కాలం నుంచే ఉందని భావిస్తున్న ఈ వ్యాధిని..1520లో అధికారికంగా గుర్తించారు. 1980లో నిర్మూలించబడిన వ్యాధుల జాబితాలో ప్రపంచ ఆరోగసంస్థ చేర్చింది. ఇక మన దేశంలో 1974 జనవరి నుంచి మే మధ్య ఐదు నెలలపాటు స్మాల్ఫాక్స్తో 15,000 మంది చనిపోయారు. తట్టుకోగలిగిన వాళ్లలో చాలా మంది చూపు పొగొట్టుకున్నారు. కకావికలం చేసిన ఈ అంటువ్యాధి.. చివరికి డబ్ల్యూహెచ్‌వో చొరవతో అదుపులోకి తేగలిగారు. 1977లో మన దేశంలో మశూచిని అదుపులోకి తేగలిగారు. అయితే మశూచికి 1796లోనే వ్యాక్సిన్(ఎడ్వర్డ్ జెన్నర్ కనిపెట్టాడు) తయారుచేసినప్పటికీ.. పూర్తిగా నిర్మూలించడానికి రెండు వందల సంవత్సరాలకు పైనే పట్టడం విశేషం.
సూరత్ ప్లేగు
భయంకరమైన అంటువ్యాధి. బ్యాక్టీరియా ద్వారా ఎలుకలు వాహకంగా ఈ అంటువ్యాధి వ్యాపిస్తుంది. 1994లో గుజరాత్ సూరత్‌లో ప్లేగు కేసులు మొదలయ్యాయి. తెరిచి ఉన్న నాలలు, చెత్త కుప్పలు, చచ్చిన ఎలుకల ద్వారా ఇది మొదలైంది. దీంతో లక్షల మంది పట్టణం వదిలి వెళ్లిపోయారు. ఇది వ్యాధి మరింత వ్యాపించడానికి కారణమైంది. ఆగష్టు నుంచి అక్టోబర్ మధ్యే దీని విజృంభణ కొనసాగింది. అయితే ఇది ఎక్కువగా విస్తరించకపోవడంతో 52 మంది మాత్రమే చనిపోయినట్లు లెక్కలు చెప్తున్నాయి. ఇది ఇతర దేశాలకు వ్యాపించినట్లు కూడా ఎక్కడా ఆధారాలు లేవు. పైగా దీని వ్యాప్తి విషయంలో నెలకొన్న గందరగోళం నడుమే.. ఈ వ్యాధి కనుమరుగుకావడం విశేషం.
డెంగ్యూ, చికున్‌గున్యా
1635లో వెస్టిండీస్‌లో మొదటిసారిగా డెంగ్యూను అంటువ్యాధిగా గుర్తించారు. చికున్‌గున్యా కేసుల్ని 1952లో టాంజానియాలో గుర్తించారు. ఇక 2006లో ఒకేసారి డెంగ్యూ, చికున్‌గున్యా వ్యాధులు రాష్ష్ర్టాలను అతలాకుతలం చేశాయి. దోమల ద్వారా సంక్రమించే ఈ వ్యాధులు.. ఢిల్లీతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్(ఉమ్మడి) ఎక్కువ ప్రభావం చూపెట్టాయి. 2006లో భారత్‌లో అధికారికంగా డెబ్భై వేలకుపైగా డెంగ్యూ కేసులు నమోదు కాగా, 50 మరణాలు సంభవించాయి. దేశంలో పదకొండు లక్షల చికున్‌గున్యా కేసులు నమోదుకాగా.. ప్రభుత్వం మాత్రం మరణాల లెక్క సున్నా అని చెప్పడం విమర్శలకు దారితీసింది.
ఎన్సెఫలిటిస్(మెదడువాపు)
జపనీస్ ఎలిటిస్(జేఈ) 1871లో జపాన్‌లో మొదటి కేసును గుర్తించారు. ఎక్యుట్ ఎస్పెఫలిటిస్ సిండ్రోమ్(ఎఈఎస్) కేసును 1955లో మద్రాస్ రీజియన్‌లో గుర్తించారు. 1978 నుంచి పాతిక వేలమంది పిల్లల ప్రాణాల్ని బలిగొన్న వ్యాధి ఇది. 2017లో గోరఖ్‌పూర్(యూపీ) నుంచి వీటి విజృంభణ ఎక్కువైంది. దోమల వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ సోకి.. మెదడుపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది.ఆ ఏడాదిలో మొత్తం 4,759 ఎఈఎస్ కేసులు నమోదు కాగా, 595 మరణాలునమోదు అయ్యాయి. జేఈ కేసుల సంఖ్య 677 కాగా, 81 మరణాలు సంభవించాయి. చికిత్స ద్వారానే ఈ వ్యాధిని అదుపు చేయడం విశేషం.
నిఫా వైరస్
జునోటిక్(జంతువుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుంది) వైరస్. మనుషులతో పాటు పందులపైనా ఈ వైరస్ ప్రభావం ఉంటుంది. నిఫా వైరస్ గబ్బిలాల(ఫ్రూట్ బ్యాట్స్) ద్వారా వ్యాప్తి చెందుతుంది. 1998లో మలేషియాలో నిఫామొదటి కేసును గుర్తించారు. అక్కడి సుంగై నిఫా అనే ఊరి పేరు మీదుగా దీనికి ఆ పేరు పెట్టారు. 2018 మే నెలలో కేరళలో నిఫా కేసులు మొదలయ్యాయి. రెండు నెలల వ్యవధిలో 18 మంది చనిపోగా.. కేవలం నెలలోనే పరిస్థితిని పూర్తిగా అదుపు చేసుకోగలిగింది కేరళ. దీనికి వ్యాక్సిన్ లేదు. అప్రమత్తంగా ఉండడమే మార్గం.
సార్స్
సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. కరోనా వైరస్ రకాల్లో ఒకటి సార్స్. 21వ శతాబ్దంలో వేగంగా వ్యాపించే జబ్బుగా గుర్తింపు దక్కించుకుంది. 2002లో చైనా ఫొషన్ నుంచి మొదలైంది. తుంపర్ల ద్వారా ఈ వైరస్ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 2003లో సార్స్(సార్స్ కోవ్) మన దేశంలో మొదటి కేసు నమోదు అయ్యింది. మొత్తం మూడుకేసులు నమోదుకాగా.. అంతా కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 30 దేశాల్లో దాదాపు ఎనిమిది వేల మంది సార్స్ బారినపడగా.. 774 మంది మృతిచెందారు. దీని కొత్త స్ట్రెయినే ఇప్పడు కరోనా వైరస్(సార్స్ కోవ్ 2)గా విజృంభిస్తోంది.