స్వాప్నికులకు’ అనుమతి!
పౌరసత్వం మాత్రం ఇవ్వం: ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలో స్వాప్నికులు (డ్రీమర్స్) నివసించేందుకు అనుమతించాలని అనుకుంటున్నాననీ, వారికి పౌరసత్వం మాత్రం ఇవ్వనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం వెల్లడించారు. ఇది కార్యరూపం దాలిస్తే భారతీయులు సహా దాదాపు 8 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. వారిలో భారతీయుల సంఖ్య దాదాపు 25 వేల వరకు ఉంటుంది. ఒబామా ప్రభుత్వం తీసుకొచ్చిన డీఏసీఏ (బాల్యంలో అక్రమంగా వచ్చిన వారిపై చర్యల వాయిదా) కార్యక్రమాన్ని ట్రంప్ ఇటీవల రద్దు చేయడం తెలిసిందే.
అమెరికా కాంగ్రెస్‌లో డెమోక్రాట్ల నాయకులు చుక్ స్కమర్, న్యాన్సీ పెలోసీలతో ట్రంప్ బుధవారం భేటీ అయిన అనంతరం గురువారం ఈ తాజా ప్రకటన చేశారు. అయితే అక్రమ వలసదారులను అడ్డుకునేందుకు మెక్సికో సరిహద్దులో నిర్మించే గోడకు డెమోక్రాట్లు మద్దతిస్తేనే తాను డీఏసీఏపై వెనక్కు తగ్గుతానని ట్రంప్ స్పష్టం చేశారు. కాగా ట్రంప్‌తో భేటీ అనంతరం పెలోసీ, స్కమర్లు మాట్లాడుతూ ట్రంప్‌తో భేటీ ఫలప్రదమైందనీ, స్వాప్నికులకు డీఏసీఏ కార్యక్రమం ప్రసాదించిన వెసులుబాట్లను చట్టరూపంలోకి తేవడానికి ట్రంప్ అంగీకరించారని తెలిపారు. మెక్సికో గోడ మినహా, మిగతా సరిహద్దు భద్రతా ప్యాకేజీ గురించి ఓ అవగాహనకు వచ్చామని అన్నారు. అయితే ఏ ఒప్పందం తమ మధ్య కుదరలేదనీ, ఒప్పందానికి దగ్గరగా మాత్రమే ఉన్నామని ట్రంప్ ఓ ట్వీట్లో స్పష్టం చేశారు.
హెచ్–1బీపై ఆంక్షలు ఉండవు...
అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు ఇతర దేశాల వారిని అనుమతించే హెచ్–1బీ వీసాలపై ఇంకా ఆంక్షలు ఉండవని ఓ అధికారి వెల్లడించారు. హెచ్–1బీ వీసా విధానాన్ని ట్రంప్ యంత్రాంగం ఇంకా పరిశీలిస్తోందనీ, ఆంక్షలను విధించలేదన్నారు. గత 9 నెలల్లో మంజూరు చేసిన హెచ్–1బీ వీసాల్లో 70 శాతం భారతీయులకే దక్కాయనీ, గతేడాది 12 లక్షల భారతీయుల వీసాలకు చట్టబద్ధత కల్పించామని ఆ అధికారి పేర్కొన్నారు. హెచ్–1బీ, ఎల్1 వీసాల్లో ప్రతి ఏడాది భారతీయుల వాటా ఆరు శాతం వృద్ధి చెందుతోందన్నారు. ఈ నెల 27న జరగనున్న అమెరికా–భారత్ ద్వైపాక్షిక చర్చల్లో హెచ్–1బీ అంశాన్ని చేర్చలేదని అధికారి చెప్పారు.