కో ఆప్షన్ పదవులు ఏకగ్రీవం
నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మంగళవారం కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. మేయర్ ఆకుల సుజాత అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో కో ఆప్షన్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు తమకు కూడా ఓ పదవి ఇవ్వాలని కోరినప్పటికీ మేయర్, ఎమ్మెల్యే నిరాకరించారు. దీంతో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎన్నికను బహిష్కరిస్తున్నామని ప్రకటించి బయటకు వెళ్లిపోయారు.
38 దరఖాస్తులు
ఐదు కో ఆప్షన్ సభ్యుల పదవుల కోసం మొత్తం 38 దరఖాస్తులు రాగా, 17 దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. సమావేశం ప్రారంభంకాగానే కాంగ్రెస్ కార్పొరేటర్లు సాయిరాం, దారంసాయిలు లేచి తమ పార్టీకి కూడా ఓ కో ఆప్షన్ పదవి ఇవ్వాలని కోరారు. బోధన్ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు ఒక పదవి ఇచ్చారని గుర్తు చేశారు. అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా ఇందుకు నిరాకరించారు. బోధన్‌లో లోపాయికారీ ఒప్పందంతోనే ఒక పదవి కాంగ్రెస్‌కు ఇచ్చారని, ఇక్కడ అలాంటి ఒప్పందం ఏదీ లేనందున పదవి ఇవ్వటం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
తాను మొదటి నుంచి అన్ని పార్టీల సభ్యులతో కలిసి నగరాన్ని అభివృద్ధి చేద్దామనే చెబుతున్నానని, కలిసిరాకపోతే తానేమి చేయలేనన్నారు. అనంతరం కాంగ్రెస్ కార్పొరేటర్లు కో ఆప్షన్ ఎన్నికను బహిష్కరిస్తున్నామని ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. ఆ తరువాత కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరిగింది. అనుభవం కలిగిన ముగ్గురిని, అల్ప సంఖ్యాక వర్గాల నుంచి ఇద్దరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కో ఆప్షన్ సభ్యులు వీరే
అనుభవజ్ఞుల కోటాలో ఎన్పీడీసీఎల్ విశ్రాంత ఏడీఈ పి. నారాయణరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి. చంద్రం, మాజీ కౌన్సిలర్ కొత్తపేట పద్మను ఎన్నుకు న్నారు. అల్ప సంఖ్యాక వర్గాల కోటాలో సామాజిక సేవకుడు, ఎంఐఎంకు చెందిన సయ్యద్ కైసర్, టీఆర్ఎస్కు చెందిన రింకీకౌర్ ఎన్నికయ్యారు. దరఖాస్తు చేసుకోనప్పటికీ ఈమెకు అవకాశం లభించడం విశే షం. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ ఫయీమ్, ఇన్చార్జి కమిషనర్ మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.
అధికార పార్టీ ఏక పక్ష నిర్ణయం
కో ఆప్షన్ సభ్యుల ఎన్నికను ఎమ్మెల్యే, మేయర్ ఏక పక్షంగా నిర్వహించారని కాంగ్రెస్ కార్పొరేటర్లు దారం సాయిలు, మాయవార్ సాయిరాం విమర్శించారు. నగర అభివృద్ధికి అన్ని పార్టీలను కలుపుకుని పోతామని చెప్పినా, తమను ఏ మాత్రం పట్టించుకోవటం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి సమావేశంలో ఎమ్మెల్యే తమకు తగిన ప్రాధాన్యం ఇస్తామని చెబుతూనే అన్యాయం చేస్తూ వచ్చార ని అన్నారు. ఇకపై అధికార పార్టీ అగడాలను సహించబోమని హెచ్చరించారు.